మరింత ఎత్తుకు...

Indian sportsmen's lightning on the international stage - Sakshi

అంతర్జాతీయ వేదికపై భారత క్రీడాకారుల మెరుపులు

ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల మెరుపులు అడపాదడపా కనిపించేవి. కానీ కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వేదిక ఏదైనా... ప్రత్యర్థులు ఏ స్థాయి వారైనా... దీటుగా బదులిస్తూ... వారిని బోల్తా కొట్టిస్తూ...అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతూ...మనోళ్లు నిలకడగా పతకాలు కొల్లగొడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించారు. భారత క్రీడారంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. తొలిసారి భారత్‌ అండర్‌–17 ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ ఈవెంట్‌ను సమర్థంగా నిర్వహించడం మరో విశేషం. – సాక్షి క్రీడావిభాగం

‘రాకెట్‌’లా దూసుకెళ్లారు... 
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక విజయాలు, అద్వితీయ పురోగతి సాధించిన క్రీడాంశం బ్యాడ్మింటన్‌. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఒకరిని మించి మరొకరు తమ ప్రదర్శనతో అబ్బురపరిచారు. శ్రీకాంత్‌ ఏకంగా నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ (ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్, డెన్మార్క్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌) సాధించి భారత్‌ తరఫున ఒకే ఏడాది అత్యధిక సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గొప్ప వేదికలపై టైటిల్‌ సాధించే సత్తా తనకూ ఉందని సాయిప్రణీత్‌ చాటుకున్నాడు. సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ను ఓడించి సాయిప్రణీత్‌ కెరీర్‌లో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయం సాధించిన ఆరు వారాల తర్వాత సాయిప్రణీత్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిల్‌ను గెలిచాడు. మరోవైపు ప్రణయ్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెగ్గాడు. ఇండోనేసియా ఓపెన్‌లో వరుస మ్యాచ్‌ల్లో మేటి ఆటగాళ్లు లీ చోంగ్‌ వీ (మలేసియా), చెన్‌ లాంగ్‌ (చైనా)లపై గెలిచిన ప్రణయ్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో మరోసారి లీ చోంగ్‌ వీని బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో పదో స్థానానికి చేరుకొని కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ అందుకున్నాడు.
 
ఇక మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు జోరు కొనసాగించింది. సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్, కొరియా ఓపెన్, ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 110 నిమిషాలపాటు జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒకుహారా (జపాన్‌) చేతిలో ఓడినప్పటికీ సింధు తన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకుంది. హాంకాంగ్‌ ఓపెన్, సీజన్‌ ముగింపు టోర్నీ దుబాయ్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచి ఈ ఏడాదిని గొప్పగా ముగించింది. మరో స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిల్‌ గెలిచి పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన తర్వాత సైనా హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో మళ్లీ చేరింది. జూనియర్‌ స్థాయిలో హైదరాబాద్‌ అమ్మాయి సామియా ఇమాద్‌ ఫారూఖి ఆసియా అండర్‌–15 బాలికల సింగిల్స్‌ టైటిల్‌ను సాధించింది.

మీరా ‘గోల్డెన్‌ లిఫ్ట్‌’... 
కొన్నేళ్లుగా డోపింగ్‌ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న భారత వెయిట్‌లిఫ్టింగ్‌ను ఈ ఏడాది మీరాబాయి చాను తన ప్రదర్శనతో తలెత్తుకునేలా చేసింది. అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ మణిపూర్‌ లిఫ్టర్‌ 48 కేజీల విభాగంలో ఓవరాల్‌గా 194 కేజీల బరువెత్తి విజేతగా నిలిచింది. 1995లో కరణం మల్లీశ్వరి తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన లిఫ్టర్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది.

‘ఆనంద’మానందమాయె... 
కొంతకాలంగా ఫామ్‌లో లేని భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌షిప్‌లో అంచనాలను తారుమారు చేస్తూ విశ్వవిజేతగా అవతరించాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఆనంద్‌ 15 గేముల్లోనూ అజేయంగా నిలువడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో సారి కాంస్యం సాధించింది.

మేరీకోమ్‌ మెరిసె...
మూడు పదుల వయసు దాటినా తనలో పంచ్‌ పవర్‌ తగ్గలేదని భారత మేటి బాక్సర్‌ మేరీకోమ్‌ నిరూపించుకుంది. వియత్నాం వేదికగా జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్‌ 48 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో ఐదోసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల తర్వాత మేరీకోమ్‌ ఖాతాలో చేరిన తొలి అంతర్జాతీయ స్వర్ణ పతకం ఇదే. ఇక భారత్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ యూత్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఐదు స్వర్ణాలు నెగ్గి ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. నీతూ (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బోరో (64 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్‌ (49 కేజీలు) రెండు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఇక ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో విజేందర్‌ సింగ్‌ పోటీపడిన రెండు బౌట్‌లలో విజేతగా నిలిచి రెండో ఏడాదీని అజేయంగా ముగించాడు.

గురి తప్పలేదు... 
గతేడాది రియో ఒలింపిక్స్‌లో వైఫ ల్యం నుంచి తేరుకున్న భారత షూటర్లు ఈ ఏడాది నిలకడగా రాణించారు. ‘డబుల్‌ ట్రాప్‌’లో అంకుర్‌ మిట్టల్‌ రూపంలో కొత్త స్టార్‌ అవతరించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన అంకుర్‌... రెండు ప్రపంచకప్‌లలో ఒక్కో స్వర్ణం, రజతం సాధించాడు. ఆసియా షాట్‌గన్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని అధిరోహించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు 20 పతకాలు... జపాన్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్‌ చాంపియన్‌షిప్‌లో 21 పతకాలు సాధించారు. స్వదేశంలో జరిగిన సీజన్‌ ముగింపు టోర్నీ ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో జీతూ రాయ్‌–హీనా సిద్ధూ ద్వయం ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచింది.  

హాకీ... చలాకీ... 
జాతీయ క్రీడలో భారత జట్లు ఈ ఏడాది అంచనాలకు అనుగుణంగా రాణించాయి. అజ్లాన్‌ షా కప్‌ టోర్నీలో కాంస్యం సాధించి సీజన్‌ను మొదలుపెట్టిన భారత పురుషుల జట్టు పదేళ్ల విరామం తర్వాత ఆసియా కప్‌లో స్వర్ణం నెగ్గింది. అంతేకాకుండా వరల్డ్‌ హాకీ లీగ్‌ ఫైనల్స్‌ టోర్నీలో కాంస్య పతకాన్ని గెలిచింది. మరోవైపు మహిళల జట్టు 13 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌లో పసిడి పతకం గెలిచి వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. ఈ విజయంతో మహిళల జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి సారి పదో స్థానానికి చేరుకుంది.

అద్వానీ అదరహో... 
ప్రపంచ టైటిల్స్‌ సాధించడం ఇంత సులువా అన్నట్లు భారత క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్, స్నూకర్‌) స్టార్‌ ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ ఈ ఏడాది తన ఫామ్‌ కొనసాగించాడు. స్నూకర్, బిలియర్డ్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి తన ప్రపంచ టైటిల్స్‌ సంఖ్యను 18కి పెంచుకున్నాడు. ఈ రెండింటితోపాటు ఆసియా స్నూకర్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో, ఆసియా బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచాడు.

ఒక్క టైటిలే...
గత ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్‌ టైటిల్స్‌ సాధించి వరుసగా రెండో ఏడాదిని టాప్‌ ర్యాంక్‌తో ముగించిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు ఈ ఏడాది కలిసిరాలేదు. సీజన్‌ ఆరంభంలో బెథానీ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన సానియా ఆ తర్వాత మరో టైటిల్‌ను గెల్చుకోలేకపోయింది. స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాద్‌ క్రీడాకారిణి ఆ తర్వాత తడబడింది. స్ట్రికోవా నుంచి విడిపోయాక  సానియాకు సరైన భాగస్వామి లభించలేదు. ఫలితంగా వరుస పరాజయాలు ఎదుర్కొన్న సానియా సీజన్‌ చివరికొచ్చేసరికి 12వ ర్యాంక్‌కు పడిపోయింది.

చిగురించిన ఆశలు... 
ప్రపంచస్థాయి ప్రమాణాలకు ఇంకా ఆమడ దూరంలో ఉన్నా... ఆసియా స్థాయిలో మాత్రం భారత అథ్లెట్స్‌ తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. స్వదేశంలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్స్‌ 12 స్వర్ణాలు, ఐదు రజతాలు, 12 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దవీందర్‌ సింగ్‌ జావెలిన్‌ త్రోలో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఓవరాల్‌గా 12వ స్థానంలో నిలిచాడు. మరోవైపు గోపీ థోనకల్‌ ఆసియా మారథాన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. చైనాలో జరిగిన ఈ ఈవెంట్‌లో గోపీ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 15 నిమిషాల 48 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

సుశీల్‌ వచ్చాడు... 
మూడేళ్లుగా రెజ్లింగ్‌కు దూరంగా ఉన్న భారత స్టార్‌ సుశీల్‌ కుమార్‌ ఈ ఏడాది పునరాగమనం చేశాడు. జాతీయ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన అతను కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top