మూడు దశాబ్దాల తర్వాత... 

Indian men team is 13th - Sakshi

భారత పురుషుల జట్టుకు 13వ స్థానం

ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్‌

హామ్‌స్టడ్‌ (స్వీడన్‌): కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఉత్సాహంతో భారత పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జట్టు ప్రపంచ టీమ్‌ చాంపియన్‌షిప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. 1985 తర్వాత భారత్‌ తొలిసారి టాప్‌–15లో నిలిచింది. స్వీడన్‌లో ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఆచంట శరత్‌ కమల్, సత్యన్, హర్మీత్‌ దేశాయ్, ఆంథోనీ అమల్‌రాజ్, సానిల్‌ శెట్టిలతో కూడిన భారత జట్టు 13వ స్థానంలో నిలిచింది. ఈ స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 3–1తో రొమేనియాను ఓడించింది.

తొలి మ్యాచ్‌లో సత్యన్‌ ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో శరత్‌ కమల్‌ 11–5, 11–9, 11–7తో హునర్‌పై గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. మూడో మ్యాచ్‌లో హర్మీత్‌ 11–6, 11–6, 11–8తో ప్లెటీ క్రిస్టియన్‌ను ఓడించి భారత్‌కు 2–1తో ఆధిక్యాన్ని అందించాడు. నాలుగో మ్యాచ్‌లో శరత్‌ కమల్‌ 11–13, 11–6, 11–7, 11–6తో ఒవిడియుపై నెగ్గి భారత్‌కు 3–1తో విజయాన్ని ఖాయం చేశాడు. 1985 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 12వ స్థానంలో నిలువడమే ఇప్పటివరకు భారత పురుషుల జట్టు అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. తాజా ప్రదర్శనతో భారత్‌ 2020 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ చాంపియన్‌షిప్‌ డివిజన్‌లోనే కొనసాగుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు 17వ స్థానంతో సరిపెట్టుకుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top