భారత్‌ చేతిలో పాక్‌ చిత్తు

Indian hockey team thrashes Pakistan in Champions Trophy opener - Sakshi

4–0తో టీమిండియా  భారీ విజయం

చాంపియన్స్‌ ట్రోఫీ  హాకీ టోర్నీలో శుభారంభం  

బ్రెడా (నెదర్లాండ్స్‌): కొత్త కోచ్‌ హరేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన తొలి ప్రముఖ టోర్నీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ భారీ విజయంతో బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 4–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున రమణ్‌దీప్‌ సింగ్‌ (26వ నిమిషంలో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (54వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (57వ ని.లో), లలిత్‌ ఉపాధ్యాయ్‌ (60వ ని.లో) తలా ఓ గోల్‌ చేశారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్‌... ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌ 13వ నిమిషంలో భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్‌ అవకాశం లభించింది. దాన్ని హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. 16వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని కూడా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

26వ నిమిషంలో రమణ్‌దీప్‌ తొలి గోల్‌ నమోదు చేయడంతో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌ 43వ నిమిషంలో పాక్‌కు పెనాల్టీ కార్నర్‌ అవకాశం దక్కినా దాన్ని గోల్‌గా మలచలేకపోయింది. చివరి క్వార్ట ర్‌లో బంతిని ఎక్కువగా తమ ఆ«ధీనంలో ఉంచు కున్న భారత్‌ పదే పదే దాడులకు దిగింది. ఈ క్రమంలో 17 ఏళ్ల దిల్‌ప్రీత్‌ అద్భుత గోల్‌తో భారత్‌ ఆధిక్యం 2–0కు పెరిగింది. చివరి 5 నిమిషాల్లో అటాకింగ్‌ చేయాలనే ఉద్దేశంతో పాక్‌ జట్టు గోల్‌కీపర్‌ను కాదని అదనపు స్ట్రయికర్‌ను బరిలో దింపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత ఆటగాళ్లు మన్‌దీప్, లలిత్‌ చెరో గోల్‌ చేసి 4–0తో భారత్‌కు తిరుగులేని విజయాన్నందించారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఒలింపిక్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌ 1–0తో అర్జెంటీనాపై నెగ్గగా... ఆస్ట్రేలియా, బెల్జియం మ్యాచ్‌ 3–3తో డ్రాగా ముగిసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top