ఐదు స్వర్ణాలపై గురి

Indian boxers have five golds - Sakshi - Sakshi

గువాహటి: సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు తమ పంచ్‌ పవర్‌ చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ మహిళల యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఐదు స్వర్ణాలపై గురి పెట్టారు. నేడు జరిగే ఫైనల్స్‌లో నీతూ (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బోరో (64 కేజీలు) స్వర్ణ పతకం కోసం పోటీపడనున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో నీతూ 4–1తో  యువాన్‌ నీ (చైనా)పై నెగ్గగా...  ఇరి సేనా (జపాన్‌)తో జరిగిన బౌట్‌లో సాక్షి పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి మూడో రౌండ్‌ మధ్యలోనే వైదొలిగింది. 

మరోవైపు ప్లస్‌ 81 కేజీల విభాగం సెమీఫైనల్లో అనస్తాసియా రిబక్‌ (రష్యా) చేతిలో నేహా యాదవ్‌ ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో జజిరా ఉరక్‌బయేవా (కజకిస్తాన్‌)తో నీతూ; ఇవీ జేన్‌ స్మిత్‌ (ఇంగ్లండ్‌)తో సాక్షి; ఎకతెరీనా మొల్చనోవా (రష్యా)తో జ్యోతి; ఎకతెరీనా దినిక్‌ (రష్యా)తో అంకుశిత; డూ హాంగ్‌ ఎన్గాక్‌ (వియత్నాం)తో శశి చోప్రా తలపడతారు. ఓవరాల్‌గా ప్రపంచ యూత్‌ చాంపియన్‌ షిప్‌ చరిత్రలో ఇదే భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన కానుంది. క్రితంసారి ఒకే ఒక్క కాంస్య పతకం నెగ్గిన భారత బాక్సర్లు ఈసారి ఐదు స్వర్ణాలపై గురి పెట్టడం విశేషం.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top