‘అప్పటి వరకు డే/నైట్‌ టెస్ట్‌ ఆడేదిలేదు’

India Will Play Day Night Tests Only When the Players Are Ready - Sakshi

సీఓఏ అధ్యక్షుడు వినోద్‌ రాయ్‌

ముంబై : ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టు ప్రతిపాదనను నిరాకరించిన బీసీసీఐ నిర్ణయాన్ని బోర్డు పాలకుల కమిటీ (సీఓఏ) అధ్యక్షుడు వినోద్‌ రాయ్‌ వెనకేసుకొచ్చాడు. డే/నైట్‌ టెస్టు ఆడితే ఓడిపోతామన్న భయంతోనే బీసీసీఐ స్వార్థంగా ఈ మ్యాచ్‌కు అంగీకరించట్లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయ్‌ మాట్లాడుతూ.. ‘‘అన్ని మ్యాచ్‌లూ గెలవాలనుకోవడంలో తప్పేం ఉంది? 30 ఏళ్ల క్రితం డ్రా చేసుకునేందుకు భారత్‌ మ్యాచ్‌లాడుతోంది అనేవారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. టీమిండియా ఆటగాళ్లు ఎప్పుడైతే డే/నైట్‌ టెస్టు ఆడడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతారో అప్పుడే దానికి అంగీకరిస్తాం’’ అని స్పష్టం చేశాడు. బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి సైతం బోర్డు నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చాడు. ఎవరితో ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఆడాలనేది తమ వ్యవహారమని, తాము భారత్‌ విజయాల కోసం కృషి చేస్తామని రాహుల్‌ జోహ్రి తెలిపాడు.

డే/నైట్‌ టెస్టు ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించాడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ మార్క్‌ వా తప్పుబట్టాడు. టెస్ట్‌ క్రికెట్‌కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డాడు. ఇక డే/నైట్‌ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్‌ ఆస్ట్రేలియా డే/నైట్‌ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్‌ డే/నైట్‌ టెస్టు ఆడాలని హర్భజన్‌ సూచించాడు. ‘డేనైట్‌ టెస్టుల్ని భారత్‌ ఎందుకు ఆడనంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఆసక్తికరంగా ఉంటుంది. ఓసారి ఆడిచూస్తే బాగుంటుంది. పింక్‌ బాల్‌ ఐతే ఏంటి. ఆడితే తప్పకుండా అలవాటు అవుతుంది. అదేమీ కష్టం కాదు... ఆడితే వచ్చే నష్టమూ లేదు’ అని అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top