
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తమకు డే నైట్ టెస్టు ఆడే ఉద్దేశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు సీఏకు లేఖ రాసింది. ఆస్ట్రేలియా కొన్నేళ్లుగా తమ దేశానికి వస్తున్న జట్లతో ఒక టెస్టును డే నైట్‌గా ఆడుతోంది. ఇందులో భాగంగా డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానున్న సిరీస్‌లోని తొలి టెస్టును గులాబీ బంతితో ఆడదామని భారత్‌కు ప్రతిపాదించింది.
అయితే, గులాబీ బంతితో ఆడాలంటే కనీసం ఏడాదిన్నర సన్నాహకం ఉండాలంటూ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలోని జట్టు మేనేజ్‌మెంట్ దీనిని వ్యతిరేకించింది. ఇదే సందేశాన్ని సీఏ చీఫ్ జేమ్స్ సదర్లాండ్‌కు మెయిల్ చేసినట్లు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌధరి తెలిపారు.