ఇక తాడోపేడో! | india vs west indies teams are in do or die in position | Sakshi
Sakshi News home page

ఇక తాడోపేడో!

Nov 27 2013 1:15 AM | Updated on Sep 2 2017 1:00 AM

ఇక తాడోపేడో!

ఇక తాడోపేడో!

ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టు మీద సంచలనాత్మక స్కోర్లతో సిరీస్ గెలిచిన భారత జట్టు వెస్టిండీస్‌తో సిరీస్‌లో తడబడటం కాస్త ఆశ్చర్యకరమే.

స్టార్ స్పోర్ట్స్-1లో ఉదయం గం. 9.00  
 నుంచి ప్రత్యక్ష ప్రసారం
 
 ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టు మీద సంచలనాత్మక స్కోర్లతో సిరీస్ గెలిచిన భారత జట్టు వెస్టిండీస్‌తో సిరీస్‌లో తడబడటం కాస్త ఆశ్చర్యకరమే. విశాఖపట్నం వన్డేలో అనూహ్యంగా పుంజుకున్న వెస్టిండీస్... సిరీస్‌లో 1-1తో ఆఖరి వన్డే కోసం కాన్పూర్ వచ్చింది. ఈసారి డే మ్యాచ్. కాబట్టి మంచు ప్రభావం పెద్దగా ఉండదు. అయితే పిచ్‌పై కనిపిస్తున్న పచ్చిక, ఉదయం మంచు పేసర్లను ఊరిస్తున్నాయి.
 
 కాన్పూర్: ప్రతిష్టాత్మక దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టు ఆడబోతున్న ఆఖరి మ్యాచ్ ఇది. కాబట్టి వెస్టిండీస్‌తో సిరీస్ గెలిచి ఆత్మవిశ్వాసంతో సఫారీ పర్యటనకు వెళ్లాలి... ఇదీ ధోనిసేన ఆలోచన. విశాఖపట్నం వన్డేలో మంచు కారణంగా బౌలర్లకు పట్టు దొరకలేదని, క్యాచ్‌లు జారిపోయాయని చెప్పిన భారత జట్టు... మరి కాన్పూర్‌లో పుంజుకుంటుందో లేదో చూడాలి. ఈసారి డే మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
 
 
 అయితే ఉదయం మంచు, పిచ్‌పై పచ్చిక కారణంగా తొలి గంట పేసర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ సందేహం లేకుండా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అటు వెస్టిండీస్ టెస్టుల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కనీసం వన్డే సిరీస్ అయినా నెగ్గి గౌరవంగా స్వదేశానికి వెళ్లాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే నేడు (బుధవారం) గ్రీన్‌పార్క్ మైదానంలో జరుగుతుంది.
 
 నలుగురిదే భారం
 చూడటానికి భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే కనిపిస్తోంది. పరుగులు కూడా భారీగానే వస్తున్నాయి. అయితే అందరు బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉన్నారా అంటే మాత్రం చెప్పడం కష్టమే. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ జట్టుకు ఇప్పటిదాకా శుభారంభాలు అందిస్తున్నారు. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి ఎవరికీ అందని రీతిలో చెలరేగుతున్నాడు. చివర్లో ధనాధన్ ధోని విధ్వంసకర ఆటతీరుతో జట్టు స్కోరును పరిగెత్తిస్తున్నాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఇప్పటిదాకా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనే ఇదే పునరావృతం అయ్యింది. అయితే ఈ నలుగురు ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాల ముందు జట్టు మిడిలార్డర్ వైఫల్యం మరుగున  పడింది. దేశవాళీ టోర్నీల్లో ఫామ్‌ను దొరకబుచ్చుకుని తిరిగి జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ ఇక్కడ ఆ స్థాయి ప్రదర్శన చూపడంలో విఫలమవుతున్నాడు. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 96 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రస్తుత సిరీస్‌లో 44 పరుగులు చేశాడు.

తనకిష్టమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగుతున్నందుకు ఈ మ్యాచ్‌లోనైనా యువీ చెలరేగుతాడని ఆశిద్దాం. ఇక రైనా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తన చివరి 23 వన్డేల్లో కేవలం ఒక్క అర్ధ సెంచరీని మాత్రమే సాధించాడు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ పాత్ర నిర్వహిస్తున్నా బౌలర్‌గానే సక్సెస్ అవుతున్నాడు. రైనా, యువరాజ్‌లలో ఎవరినైనా ఆపి రాయుడికి అవకాశం ఇస్తారేమో చూడాలి. ఇక బౌలింగ్‌లో వాతావరణ పరిస్థితుల కారణంగా భువీ, షమీ, మోహిత్ విశాఖ వన్డేలో పరుగులు బాగానే ఇచ్చారు. ఫీల్డింగ్ విభాగం కూడా మెరుగుపడాల్సి ఉంది.
 
 ఆత్మవిశ్వాసంతో విండీస్
 రెండో వన్డేలో ఏకంగా నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలతో ఫామ్ చాటుకోవడంతో విండీస్ ఉత్సాహంతో ఉంది. గేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన కీరన్ పావెల్‌తో పాటు డారెన్ బ్రేవో, లెండిల్ సిమన్స్, స్యామీ అద్భుతమైన ఆటతీరుతో సిరీస్‌ను సజీవంగా నిలిపారు. అయితే కెప్టెన్ డ్వేన్ బ్రేవో బ్యాటింగ్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. నిలకడగా ఆడలేకపోవడంతో జట్టుపై ప్రభావం పడుతోంది. మరోవైపు చివరి వన్డేలోనూ నెగ్గాలంటే బౌలింగ్ విభాగం మరోమారు అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది. రాంపాల్, హోల్డర్, నరైన్ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం.
 
 జట్లు (అంచనా):
 భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, భువనేశ్వర్, అశ్విన్, షమీ, మోహిత్.
 
 వెస్టిండీస్: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), చార్లెస్, పావెల్, శామ్యూల్స్, సిమన్స్, డారెన్ బ్రేవో, స్యామీ, రాంపాల్, హోల్డర్, నరైన్, పెరుమాల్.
 
 3 భారత్ ఇక్కడ ఆడిన 11 వన్డేల్లో మూడు సార్లు ఓటమి చవిచూసింది. 1994లో విండీస్ చేతిలో ఓడింది.
 
 4 ఈ స్టేడియంలో నాలుగేళ్ల అనంతరం జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్ ఇది.
 
 పిచ్, వాతావరణం
 వర్షం ప్రమాదం లేదు. ఆరంభంలో పేసర్లకు అనుకూలించే పిచ్. క్రమంగా బ్యాట్స్‌మెన్ చెలరేగొచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
 
  సిరీస్ విజయం అవసరం
 ‘కఠినమైన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు జరుగుతున్న ఈ చివరి మ్యాచ్ మాకు  చాలా కీలకం. సిరీస్ నెగ్గి ఆ టూర్‌కు ధీమాతో వెళ్లాలని భావిస్తున్నాం. నా వరకైతే సొంత మైదానంలో మంచి ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నాను.  చివరి వన్డేలో మంచు కారణంగానే ఓడిపోయినా దాన్నే సాకుగా చెప్పలేం’     
 - భువనేశ్వర్ (భారత్ పేసర్)
 
 ఆత్మవిశ్వాసం పెరిగింది
 ‘విశాఖ వన్డేలో నెగ్గిన తీరు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. భారత జట్టును భారత్‌లో ఓడించగలిగాం. ఇదే ఆటతీరును కాన్పూర్‌లోనూ కొనసాగించేందుకు చూస్తున్నాం. భారత్‌తో ఆడిన చివరి ఐదు వన్డేల్లో మేం మూడింటినే కోల్పోయాం’
 - డ్వేన్ బ్రేవో (విండీస్ కెప్టెన్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement