ఇంగ్లండ్‌ పోరాటం

india take the test fouth test match - Sakshi

రసపట్టులో నాలుగో టెస్టు

రాణించిన బట్లర్, రూట్‌

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 260/8

శ్రమించిన భారత పేసర్లు  

భారత్‌కు పట్టు చిక్కినా... ఇంగ్లండ్‌ పరుగు పెట్టింది. టాపార్డర్‌ను కట్టడి చేసిన పేసర్లు మిడిలార్డర్‌ పోరాటంతో వెనుకబడ్డారు. దీంతో ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లో ఇబ్బందిపడ్డా... రెండో సెషన్‌లో కోలుకుంది. చివరకు మూడో రోజు ఆటలో స్కోరు 260/8 దాకా చేరింది. మొత్తానికి నాలుగో రోజు నాటకీయత మ్యాచ్‌నే కాదు సిరీస్‌ ఫలితాన్నే శాసించనుంది.  భారత్‌ గెలుపో... ఓటమి   వైపో తేలనుంది.  

సౌతాంప్టన్‌: ఈ టెస్టునే కాదు... సిరీస్‌నే శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో టెస్టు ఇరు జట్లను ఊరిస్తుంది. దీన్ని నాలుగో రోజు ఆట (ఆదివారం) తేల్చేస్తుంది. మూడో రోజు ఒక సెషన్‌ భారత్‌ వైపు మొగ్గితే... మరో సెషన్‌ ఇంగ్లండ్‌ను నడిపించింది. శనివారం తొలి సెషన్‌లో భారత పేసర్ల ఉత్సాహంపై రెండో సెషన్‌లో రూట్‌ (88 బంతుల్లో 48; 6 ఫోర్లు), మూడో సెషన్‌లో బట్లర్‌ (122 బంతుల్లో 69; 7 ఫోర్లు) నీళ్లు చల్లారు. దీంతో ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ పోరాటంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో షమీ 3, ఇషాంత్‌ శర్మ 2 వికెట్లు తీయగా, బుమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 8 వికెట్లకు 260 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 233 పరుగుల ఆధిక్యంలో ఉంది. కరన్‌ (67 బంతుల్లో 37 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. 

పేస్‌ సెషన్‌... 
ఓవర్‌నైట్‌ స్కోరు 6/0తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను భారత పేసర్లు ఇబ్బంది పెట్టారు. జట్టు స్కోరు 24 పరుగుల వద్ద కుక్‌ (12)ను బుమ్రా ఔట్‌ చేయగా, కాసేపటికే మొయిన్‌ అలీ (9)ని ఇషాంత్‌ పెవిలియన్‌ చేర్చాడు. వీళ్లిద్దరి క్యాచ్‌లను రెండో స్లిప్‌లో ఉన్న రాహుల్‌ అందుకున్నాడు. 33 పరుగుల వద్ద 2 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఓపెనర్‌ జెన్నింగ్స్‌ (36; 6 ఫోర్లు), కెప్టెన్‌ రూట్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు 16 ఓవర్లపాటు ఓపిగ్గా బ్యాటింగ్‌ చేశారు. అయితే లంచ్‌ విరామానికి ముందు షమీ బౌలింగ్‌లో జెన్నింగ్స్‌ వికెట్ల ముందు దొరికిపోవడంతో 59 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. షమీ ఓవర్లో మరో బంతి మిగిలున్నా... అదే స్కోరు (92/3) వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. రెండో సెషన్‌ మొదలైందో లేదో షమీ తన మిగిలిన బంతితో బెయిర్‌స్టో (0)ను డకౌట్‌ చేశాడు.  

బెయిర్‌స్టో నిష్క్రమణతో వచ్చిన స్టోక్స్‌... కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే బాధ్యత తీసుకున్నాడు. కానీ సమన్వయలోపం ఈ జోడీని ఎక్కువసేపు క్రీజులో నిలువనీయలేదు. అర్ధసెంచరీకి చేరువైన రూట్‌ లేని పరుగుకోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ మిడాన్‌లో షాట్‌ ఆడి పరుగందుకున్నాడు. అక్కడే ఉన్న షమీ  డైరెక్ట్‌ హిట్‌తో స్ట్రయికింగ్‌ వికెట్లను పడేయడంతో 122/5 జట్టు స్కోరు వద్ద రూట్‌ ఆట ముగిసింది. తర్వాత స్టోక్స్‌కు బట్లర్‌ జతయ్యాడు. వీళ్లిద్దరు మరో వికెట్‌ పడకుండా రెండో సెషన్‌ను ముగించారు. టీ విరామం అనంతరం నింపాదిగా ఆడుతున్న స్టోక్స్‌ను స్పిన్నర్‌ అశ్విన్‌ ఔట్‌ చేశాడు. అలా 178 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో బట్లర్‌కు కరన్‌ జతయ్యాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పలేదు. జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. బట్లర్‌ 96 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్న ఈ జోడీని ఇషాంత్‌ శర్మ విడగొట్టాడు. బట్లర్‌ను ఎల్బీగా పెవిలియన్‌ చేర్చడంతో 55 పరుగుల ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆట చివర్లో రషీద్‌ (11) షమీ బౌలింగ్‌లో కీపర్‌ రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top