
సిడ్నీ: ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్టు సిరీస్ గెలవాలనే లక్ష్యంతో ఉండటంతోనే డే–నైట్ టెస్టు ఆడనంటోందని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ అన్నారు. ఓ రేడియో చానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేయడంలో ఆతిథ్య దేశానికే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పుడు, ఎక్కడ ఆడాలనేది ఆతిథ్య దేశం నిర్ణయానికే వదిలేయాలన్నారు. ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్టులంటే ఇప్పటి వరకు గులాబీ రంగు కూకాబుర్రా బంతులతోనే జరుగుతున్నాయి. దీని నాణ్యత, స్పందించే తీరుపై బీసీసీఐ మొదటినుంచి వ్యతిరేకంగానే ఉంది. డే–నైట్ టెస్టుపై బీసీసీఐ పాలక కమిటీ చీఫ్ వినోద్ రాయ్‌ని సంప్రదించగా ‘ఇప్పటికే దానిపై మా వైఖరిని వెల్లడించాం.
ఇక దీనిపై బోర్డు నిర్ణయం మార్చుకుంటుందని నేను అనుకోవడం లేదు. దేశవాళీ టోర్నీల్లో పింక్ బంతితో డే–నైట్ మ్యాచ్‌లను కొనసాగిస్తాం’ అని అన్నారు. గెలవడం కోసమే ఆడమంటున్నారని సదర్లాండ్ పేర్కొన్న వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి స్పందించారు. ఎవరైనా గెలవడం కోసమే ఆడతారని ఇందులో తప్పేమీ లేదని అన్నారు. మరోవైపు సదర్లాండ్ మాట్లాడుతూ ‘ట్యాంపరింగ్ వివాదంలో శిక్ష పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు తిరిగి జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశాలున్నాయి. ఆటను మరింత మెరుగుపర్చుకొని తమ విలువేమిటో సెలక్టర్లకు తెలపాలి. వాళ్లపై నాకు సానుభూతి ఉంది. వాళ్ల క్షమాపణల్ని మన్నించాం. తిరిగి వాళ్లందరినీ జాతీయ జట్టులో చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.