
పుణె : వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి(107: 119 బంతుల్లో 10 ఫోర్లు,1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాట్స్‌మన్ సహకారం అందించకపోవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. విండీస్ బౌలర్లు మార్లోన్ శామ్యూల్స్ మూడు , హోల్డర్, మెక్‌కాయ్, అశ్లేనర్స్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో విండీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గత వైజాగ్ వన్డేలో ఊరించి చేజారిన విజయాన్ని విండీస్ ఈ మ్యాచ్‌లో ఒడిసిపట్టుకుంది. భారత బ్యాట్స్‌మెన్ కోహ్లి మినహా రోహిత్(8), ధావన్ (35), రాయుడు (22), పంత్ (24), ధోని(7)లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన విండీస్‌కు బ్యాట్స్‌మన్ షై హోప్ (95), అశ్లే నర్స్ (40), హెట్‌మైర్ (37), హోల్డర్(32)లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనలో తడబడిన భారత్‌కు కోహ్లి శతకం గట్టెక్కించలేకపోయింది.