
మరో పంచ్‌కు సిద్ధం !
చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం 150 సంవత్సరాల సంబరాలు భారత్, శ్రీలంక వన్డే మ్యాచ్ నేపథ్యంలో జరగనున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు సొంతగడ్డపై శ్రీలంకతో వన్డే సిరీస్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, అది భారత్‌కు సన్నాహకంగా పనికి రాదని చాలా మంది భావించారు. అయితే టీమిండియా కుర్రాళ్లకు మాత్రం ఇది బాగా కలిసొచ్చింది. వారు దానిని సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సిరీస్ కూడా సొంతం కావడంతో మరికొందరు ఆటగాళ్లకు కూడా తమ సత్తా చాటుకునే అవకాశం దక్కనుంది. మరోవైపు భారత్ తన నంబర్‌వన్ స్థానాన్ని పదిలపర్చుకుంటుంది.
కోల్‌కతా: చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం 150 సంవత్సరాల సంబరాలు భారత్, శ్రీలంక వన్డే మ్యాచ్ నేపథ్యంలో జరగనున్నాయి. గురువారం ఇక్కడ జరిగే నాలుగో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్‌ను గెలుచుకోవడంతో మరికొందరు రిజర్వ్ ఆటగాళ్లను పరిశీలించాలని భావిస్తుండగా... కనీసం ఒక్క వన్డే అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో శ్రీలంక ఉంది.
రోహిత్ వచ్చాడు...
చివరి రెండు వన్డేల కోసం భారత జట్టులో పలు మార్పులు జరిగాయి. వీరిలో రోహిత్ శర్మ, రాబిన్ ఉతప్పలకు తుది జట్టులో చోటు ఖాయమైంది. గాయంతో జట్టుకు దూరమై... లంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్, మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్‌ను మినహాయిస్తే కెరీర్‌లో ఎనిమిది లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లలోనే వికెట్ కీపింగ్ చేసిన ఉతప్ప, తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆ బాధ్యత నిర్వర్తించనున్నాడు.
రహానేకు తోడుగా వీరిద్దరిలో ఎవరు మరో ఓపెనర్‌గా ఆడతారనేది చూడాలి. కోహ్లి, రైనా, అంబటి రాయుడులతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో ఆడిన ఇషాంత్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే బ్యాటింగ్‌లో కూడా రాణించగల లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మకు తొలిసారి చోటు దక్కవచ్చు. శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కరణ్ (4/47) అందరికంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు.
అంతా గందరగోళం...
ఈ సిరీస్‌కు ముందు ఫామ్ చూస్తే పటిష్టమైన వన్డే జట్టుగా కనిపించిన శ్రీలంక, భారత గడ్డపై ఒక్కసారిగా కుదేలైంది. మూడు మ్యాచ్‌లలోనూ ఆ జట్టు ఆటతీరు ఒకే విధంగా, నాసిరకంగా కనిపించింది. బ్యాటింగ్‌లో సమష్టిగా వైఫల్యం, బౌలింగ్‌లో భారత్‌కు భారీగా, సునాయాసంగా పరుగులు సమర్పించుకోవడం... చివరకు ఓటమి. ఎక్కడా పోరాటపటిమ కనబర్చలేదు. ఈ నేపథ్యంలో లంక కూడా కొన్ని మార్పులు చేసి ఆశావహ దృక్పథంతో బరిలోకి దిగుతోంది.
సీనియర్ సంగక్కర ఇప్పటికే లంకకు వెళ్లిపోయాడు. ఇటీవల వెస్టిండీస్ ‘ఎ’తో సిరీస్‌లో రాణించిన చండీమల్, తిరిమన్నెలను జట్టులోకి ఎంపిక చేశారు. జయవర్ధనే ఫామ్‌లోకి రావడం జట్టుకు మేలు చేసే అంశం. ఇక బౌలింగ్‌లో అజంత మెండిస్ కూడా తుది జట్టులోకి రావడం ఖాయమైంది. ఇతర జట్లతో పోలిస్తే భారత్‌పై అతని రికార్డు చాలా బాగుంది.
జట్ల వివరాలు (అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రహానే, రైనా, రాయుడు, ఉతప్ప, అక్షర్, అశ్విన్, ఉమేశ్, ధావల్, బిన్నీ/కరణ్.
శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కుషాల్ పెరీరా, దిల్షాన్, చండీమల్, జయవర్ధనే, తిరిమన్నె, ప్రసన్న, తిసార పెరీరా, కులశేఖర, మెండిస్, గమగే/ఎరాంగ.
పిచ్, వాతావరణం
ఈ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్ వికెట్ సిద్ధంగా ఉంది. బౌలర్లకు పెద్దగా సహకారం ఉండకపోవచ్చని ఈడెన్ క్యురేటర్ నిర్ధారించారు. భారీ స్కోర్లు ఖాయం. రాత్రి సమయంలో కొద్దిగా మంచు మినహా, మ్యాచ్ రోజు మంచి ఎండ కాస్తుందని, మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం ఉండదని సమాచారం.
‘ప్రపంచ కప్ దగ్గరలోనే ఉంది కాబట్టి మేం విజయాలను అలవాటుగా మార్చుకోవాలని భావిస్తున్నాం. సిరీస్ గెలిచినా కూడా ఉదాసీనత ప్రదర్శించం. మైదానంలో అదే తీవ్రతతో ఆడతాం. రోహిత్ శర్మ తిరిగి రావడం జట్టుకు ఎంతో ఉపయోగం. ప్రపంచకప్‌లో కూడా అతను కీలకం అవుతాడు. మ్యాచ్‌లను గెలిపించే సత్తా అతనిలో ఉంది. ఆస్ట్రేలియాతో టెస్టులో నాయకత్వం వహించనుండటం గురించి ఉద్వేగానికి లోనవుతున్నాను. పదునైన పేస్ బౌలింగ్ అటాక్ మనకు ఉంది. దీంతో మంచి ఫలితాలు సాధించగలమని నమ్ముతున్నా.’
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
‘మా జట్టు ఇక్కడ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అయితే దీని వల్ల ఆందోళన లేదు. అన్నీ సర్దుకుంటాయి. మా ప్రపంచ కప్ సన్నాహాలకు కూడా సమస్య లేదు. దానికి ముందు చాలా మ్యాచ్‌లు ఆడబోతున్నాం. పెద్ద టోర్నీల్లో, కీలక సమయాల్లో రాణించగల సామర్థ్యం మా ఆటగాళ్లకు ఉంది. టి20 ఫైనల్ చివరి ఓవర్లలో మా బౌలింగ్ ఎలా ఉందో చూశారుగా. ఈ సిరీస్‌లో మా వ్యూహాలపై పునరాలోచించి విజయంపై దృష్టి పెడతాం. ఫలితం తేలిపోయినా ఇరు జట్లలోనూ తమ సత్తా నిరూపించుకోవాల్సిన ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి రెండు మ్యాచ్‌లూ కీలకమే.’
- జయవర్ధనే, శ్రీలంక క్రికెటర్