తొలి టెస్టులో టీమిండియాకు షాక్‌

India come crashing down after Kohli exit - Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు షాక్‌ తగిలింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్‌ గ్యాంగ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. 110/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా మరో 52 పరుగుల మాత‍్రమే జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

ఈ రోజు ఆటలో ఓవర్‌నైట్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌(20) ఆదిలోనే పెవిలియన్‌ చేరగా, కాసేపటికి మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(51) సైతం ఔటయ్యాడు.  దినేశ్‌ కార్తీక్‌ను జేమ్స్‌ అండర్సన్‌ పెవిలియన్‌కు పంపగా, స్టోక్స్‌ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీగా ఔటయ్యాడు. ఆపై వెంటనే మహ్మద్‌ షమీ డకౌట్‌గా నిష్క్రమించాడు. దాంతో టీమిండియా 141 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో హార్దిక్‌ పాండ్యా(31)  ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కాగా, ఇషాంత్‌ శర్మ(11) తొమ్మిదో వికెట్‌గా ఔటైన కాసేపటికి హార్దిక్‌ పెవిలియన్‌ చేరడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ నాలుగు వికెట్లతో టీమిండియాను దెబ్బ తీశాడు. అతనికి జతగా జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, సామ్‌ కుర్రాన్‌, అదిల్‌ రషీద్‌లకు చెరో వికెట్‌ తీశారు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 287  ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌  180 ఆలౌట్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 274 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌  162 ఆలౌట్‌

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top