తొలి టెస్టులో టీమిండియా విజయం | India beat Australia by 31 runs in First Test | Sakshi
Sakshi News home page

తొలి టెస్టులో టీమిండియా విజయం

Dec 10 2018 10:53 AM | Updated on Dec 10 2018 2:05 PM

India beat Australia by 31 runs in First Test - Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కడవరకూ పోరాడిన విరాట్‌ గ్యాంగ్‌.. ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. 323 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా 104/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ 291 పరుగుల వద్ద ఆలౌటైంది. గత 11 ఏళ్లలో ఆసీస్‌ గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 2008లో పెర్త్‌లో ఆసీస్‌పై విజయం సాధించింది. ఆసీస్‌ పర్యటనలో సిరీస్‌లో తొలి టెస్టు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. 

ఆసీస్‌ ఆటగాళ్లలో షాన్‌ మార్ష్‌(60; 166 బంతుల్లో 5 ఫోర్లు), పైన్‌(41; 73 బంతుల్లో 4 ఫోర్లు) రాణించగా, మిచెల్‌ స్టార్క్‌(28; 44 బంతుల్లో 2 ఫోర్లు), ప్యాట్‌ కమిన్స్‌(28; 121 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ప‍్రధానంగా కమిన్స్‌ భారత బౌలర్లకు పరీక్షగా నిలిచి ముప్పుతిప్పలు పెట్టాడు. 20 ఓవర్లకు పైగా ఆడి చివరకు బూమ్రా బౌలింగ్‌లో కమిన్స్‌ తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు.

ఈ రోజు ఆటలో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు షాన్‌ మార్ష్‌, ట్రావిస్‌ హెడ్‌లు ఆరంభించారు. ఈ జోడి 31 పరుగులు జోడించిన తర్వాత హెడ్‌ ఐదో వికెట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. తొలి సెషన్‌లోనే హెడ్‌ను ఇషాంత్‌ బోల్తా కొట్టించడంతో ఆసీస్‌ 115 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. అటు తర్వాతే భారత్‌కు అసలైన పరీక్ష ఎదురైంది. టిమ్‌ పైన్‌-మార్ష్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 41 పరుగులు జోడించిన తర్వాత మార్ష్‌ను బూమ్రా ఔట్‌ చేయడంతో భారత్‌ కాస్త ఊపిరిపీల్చుకుంది. అయితే ప్యాట్‌ కమిన్స్‌-పైన్‌ల జంట కూడా భారత బౌలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో మరో వికెట్‌ సాధించడానికి 12 ఓవర్లు ఆగాల్సి వచ్చింది. 

కాగా, 31 పరుగుల భాగస్వామ్యం తర్వాత బూమ్రా బౌలింగ్‌లో  పైన్‌ ఏడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ ఆశలు చిగురించాయి. ఆ తరుణంలో కమిన్స్‌-స్టార్క్‌ జోడి మరో అద్భుత ప్రదర్శన చేసింది. ఒకవైపు స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూనే అత్యంత నిలకడగా ఆడటంతో టీమిండియా శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ జోడిని విడగొట్టడానికి సుమారు 16 ఓవర్లు అవసరమయ్యాయి. ఆసీస్‌ స్కోరు 228 పరుగుల వద్ద స్టార్క్‌ ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. వీరు 41 పరుగులు సాధించి జట్టు పరిస్థితిని గాడిలో పెట్టారు. ఆపై లయన్స్‌తో కలిసి 31 పరుగులు సాధించిన తర్వాత కమిన్స్‌ ఔట్‌ కావడంతో టీమిండియా గెలుపుకు వికెట్‌ దూరంలో నిలిచింది. అటు తర్వాత లయాన్‌-హజల్‌వుడ్‌ మరోసారి భారత్‌ను టెన్షన్‌కు గురిచేశారు.  లయన్‌(37 నాటౌట్‌; 46 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి చివరి వికెట్‌ కు 32 పరుగులు జత చేసిన తర్వాత హజల్‌వుడ్‌(7; 35 బంతుల్లో) ఔట్‌ కావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. భారత బౌలర్లలో బూమ్రా, మహ్మద్‌ షమీలు అశ్విన్‌ తలో మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ వికెట్‌ తీశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ చతేశ్వర పుజారకు దక్కింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement