మన చేతిలోకి వచ్చేసింది! | India 312-2 at close, lead S. Lanka by 107 runs | Sakshi
Sakshi News home page

మన చేతిలోకి వచ్చేసింది!

Nov 26 2017 1:51 AM | Updated on Nov 26 2017 8:27 AM

India 312-2 at close, lead S. Lanka by 107 runs - Sakshi - Sakshi - Sakshi

పడింది ఒక వికెట్టే... వచ్చినవి 301 పరుగులు! తొలి టెస్టులో లంకను వెలుతురులేమి కాపాడిందేమో కానీ... ఈ టెస్టును కాపాడాలంటే బహుశా ఎనిమిదో వండర్‌ కావాలేమో! నాగ్‌పూర్‌లో భారత టాపార్డర్‌ పరుగుల హోరును, శతకాల జోరును చూపెట్టింది. ఇప్పటికే ఆధిక్యం వంద దాటింది. ఇంకా చేతిలో 8 వికెట్లు. ఇక ఈ ఆధిక్యం ఎందాకో... ఈ మ్యాచ్‌ ఏ రోజు ముగుస్తుందో నేటి సాయంత్రమే తేలిపోనుంది!  

నాగ్‌పూర్‌: రెండో టెస్టు రెండో రోజే భారత్‌ చేతిలోకొచ్చేసింది. ఇక ఐదో రోజుదాకా చూడాల్సిన అవసరం రాదేమో! తొలిరోజు బౌలర్ల శ్రమకు రెండో రోజు బ్యాట్స్‌మెన్‌ జోరు కలిసింది. దీంతో ఆధిక్యం అందనంత దిశగా సాగిపోతోంది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (221 బంతుల్లో 128; 11 ఫోర్లు, 1 సిక్స్‌), చతేశ్వర్‌ పుజారా (284 బంతుల్లో 121 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. కెప్టెన్‌ కోహ్లి (70 బంతుల్లో 54 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) అర్ధసెంచరీని అధిగమించాడు. దీంతో శనివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 2 వికెట్లకు 312 పరుగులు చేసింది. ఇప్పటికే 107 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్లున్నాయి. దీంతో మూడో రోజు భారత్‌ భారీ ఆధిక్యానికి రంగం సిద్ధమైంది. 

సెషన్‌కో ఫిఫ్టీ, సెంచరీ! 
రెండో రోజంతా భారత బ్యాట్స్‌మెన్‌దే ఆధిపత్యం. ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 301 పరుగులు జత చేసిన కోహ్లి సేన కేవలం ఒకే ఒక్క వికెట్‌ను కోల్పోయింది. భారత బ్యాట్స్‌ మెన్‌ సగటున సెషన్‌కో ఫిఫ్టీ, సెంచరీ సాధించారు. తొలి సెషన్‌లో విజయ్‌ అర్ధ శతకం కొడితే... రెండో సెషన్‌లో పుజారా ఆ పని చేశాడు. కాసేపటికి విజయ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మూడో సెషన్‌లో పూజారా శతక్కొట్టగా... కోహ్లి అర్ధ సెంచరీ బాదేశాడు. రెండు సెషన్ల పాటు వికెట్‌ కోసం తపించినా వికెట్‌ లభించలేదు. ఎట్టకేలకు మూడో సెషన్‌లో విజయ్‌ని హెరాత్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 

భారీ భాగస్వామ్యం 
క్రితం రోజు స్కోరు 11/1తో శనివారం ఆట కొనసాగించిన భారత బ్యాట్స్‌మెన్‌ విజయ్, పుజారా పర్యాటక బౌలర్ల భరతం పట్టారు. లంక పేసర్లు, స్పిన్నర్లు ఎలాంటి బంతిని వేసినా ఏకాగ్రతను మాత్రం కోల్పోలేదు. దీంతో ఇక్కట్లు లంకకు... పరుగులు భారత్‌ పక్షాన నిలిచాయి. లంక కెప్టెన్‌ చండిమాల్‌ పేసర్లు, స్పిన్నర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఈ జోడిని విడగొట్టలేకపోయాడు. విజయ్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే భారత్‌ స్కోరు 100 పరుగులు చేరింది. రెండో సెషన్‌ కూడా దీనికి భిన్నంగా సాగలేదు. దీంతో మొదట విజయ్, పుజారాల భాగస్వామ్యం శతకాన్ని దాటింది. ఆ తర్వాత పుజారా కూడా తన ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు.

 ఇలా లంక కష్టాలు సెషన్‌ సెషన్‌కు పెరిగాయి. అటు వికెట్లు పడగొట్టలేక, ఇటు పరుగులకు అడ్డుకట్ట వేయలేక అలసిసొలసిపోయారు. మరోవైపు మెల్లగా విజయ్‌ సెంచరీని అధిగమించాడు. ఇక మూడో సెషన్‌లో భారత్‌ స్కోరు 200 పరుగులకు... ఆ తర్వాత ఆధిక్యాన్ని (శ్రీలంక 205) అందుకుంది. రెండో వికెట్‌కు 209 పరుగులు జోడిం చాక ఎట్టకేలకు లంక శిబిరంలో విజయ్‌ వికెట్‌ ఆనందాన్ని నింపింది. కానీ కోహ్లి వచ్చాక మళ్లీ కష్టాలు పెరిగాయి. అతను పుజారాతో కలిసి వడివడిగా పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో పుజారా సెంచరీ, కోహ్లి అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... లంక మాత్రం మరో వికెట్‌ తీయలేకపోయింది. 

1 టెస్టుల్లో పదో సెంచరీ సాధించిన మురళీ విజయ్‌కి లంకపై ఇదే తొలి శతకం 

♦ 3 పుజారా–విజయ్‌లు ఇప్పటి వరకు మూడు సార్లు డబుల్‌ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. 

♦ 10 2013 తర్వాత విజయ్‌–పుజారా జోడీ చేసిన సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య. మరో 8 అర్ధశతక భాగస్వామ్యాలూ ఉన్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రపంచంలో ఏ జోడీ ఈ ఘనత సాధించలేకపోయింది. 

♦ 10 టెస్టు కెరీర్‌లో పుజారా 14 సెంచరీలు చేస్తే... ఇందులో సొంతగడ్డపైనే పది ఉన్నాయి.  

స్కోరు వివరాలు 
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 205; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) గమగే 7; మురళీ విజయ్‌ (సి) పెరీరా (బి) హెరాత్‌ 128; పుజారా బ్యాటింగ్‌ 121; కోహ్లి బ్యాటింగ్‌ 54; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (98 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 312. 

వికెట్ల పతనం: 1–7, 2–216. బౌలింగ్‌: లక్మల్‌ 18–2–58–0, గమగే 22–7–47–1, హెరాత్‌ 24–8–45–1, షనక 13–3–43–0, పెరీరా 21–0–117–0. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement