
పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం చిటికెలో పని.. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక ఓటమి మినహా ఏడు సాధికారిక విజయాలతో సెమీస్ చేరిన కోహ్లి సేన అండర్‌డాగ్స్‌ని మట్టికరిపించి తీరుతుంది... పాక్‌తో సమానంగా ఐదు విజయాలే సాధించినా, వరుసగా గత మూడు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా రన్‌రేట్ రూపంలో అదృష్టం కలిసొచ్చి కివీస్ సెమీస్ చేరిందన్న మాటేగానీ బ్లాక్ క్యాప్స్ గెలిచే ముచ్చటే లేదు.... బలబలాల పరంగా చూసినా ప్రత్యర్థి కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్న కోహ్లి సేననే తప్పక విజయం వరిస్తుంది.
ఇవీ సెమీ ఫైనల్‌కు ముందు టీమిండియాపై ఉన్న అంచనాలు. సగటు అభిమానితో సహా మాజీ క్రికెట్ దిగ్గజాలు కూడా భారత జట్టు ఫైనల్‌కు చేరుతుందని ఫిక్సయిపోయారు. మెగా టోర్నీలో ఆది నుంచి అద్భుత విజయాలు సాధించిన కోహ్లి సేన తదుపరి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఢీకొంటుందా.. లేదా ఇంగ్లండ్‌తో తలపడుతుందా అంటూ ఎవరికి తోచిన విధంగా ప్రస్తుత సమీకరణల ఆధారంగా విశ్లేషణ చేశారు. తొలి సెమీస్‌లో భారత ప్రత్యర్థి కివీస్ అని తేలిన తర్వాత.. కోహ్లి సేన ఫైనల్ చేరినట్టేనని, ఇక కష్టపడాల్సింది తమ ఆటగాళ్లేనని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ పేర్కొనడం... భారత్-ఇంగ్లండ్ జట్లు వరల్డ్‌కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయని ఇప్పటికే దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ జోస్యం చెప్పడం, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేయడం.. వీరే కాకుండా మరెంతో మంది క్రికెట్ దిగ్గజాల విశ్లేషణల నేపథ్యంలో బుధవారం నాటి మ్యాచ్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులు, అభిమానుల ఆశల్ని సొమ్ము చేసుకునేందుకు బుకీలు రంగంలోకి దిగారు. అండర్ వరల్డ్ డాన్‌లతో కలిసి భారీ స్థాయిలో బెట్టింగ్‌లకు పాల్పడి జేబులు నింపుకున్నారు. ఒక్క ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే బెట్టింగ్ ద్వారా రూ. 150 కోట్ల మేర వ్యాపారం జరిగిందంటే దేశ, విదేశాల్లో ఏ మేరకు డబ్బు చేతులు మారిందో అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధాని ప్రాంతంలోని ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్‌లలో పెద్ద ఎత్తున బెట్టింగ్ దందా జరిగినట్లు సమాచారం. బడా బడా వ్యాపారవేత్తలు మొదలు చదువుకునే పిల్లల దాకా బెట్టింగ్‌కు పాల్పడి జేబులు గుళ్ల చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మహా నగరంలోని హోటళ్లు, మాల్స్ ఇందుకు వేదికగా మారినట్లు తమకు సమాచారం అందిందని.. ఈ మేరకు విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
ఇక ఐపీఎల్ తరహాలోనే ఈసారి కూడా బెట్టింగ్ రాయుళ్ల అంచనాలు తారుమారు కావడంతో భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్‌కు వరణుడు అడ్డుపడటంతో రెండు రోజుల పాటు మ్యాచ్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన రిజర్వ్ డే మ్యాచ్‌లో మొదట టాస్‌పై.. అటు తర్వాత కెప్టెన్ నిర్ణయంపై... ఆనక ఇరు జట్ల బలాబలాల ఆధారంగా బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. కోహ్లి సేన విజయంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో టీమిండియా గెలుపుపై కేవలం రూ. 4.35 బెట్ నిర్వహించిన బుకీలు న్యూజిలాండ్‌పై ఏకంగా రూ. 49 పందెం కాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా టీమిండియా ఆటగాళ్లపై తక్కువ మొత్తం(రూ. పది లోపే)లో రేటు కట్టిన బుకీలు.. కివీస్ ఆటగాళ్ల ప్రదర్శనపై అధిక ధరలు నిర్ణయించడంతో బెట్టింగ్ రాయుళ్లు భారీ మొత్తంలో సొమ్ము ఖర్చు పెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏదేమైనా సెమీ ఫైనల్ ఓటమితో కోట్లాది మంది అభిమానుల గుండె బద్దలు చేసిన టీమిండియా ఓటమి... బెట్టింగ్ రాయుళ్ల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 18 పరుగుల తేడాతో పరాజయం పాలై ఇంటి బాట పట్టింది.