ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

How Stokess advice worked for Archer in Super Over - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ కప్‌ అంచుల వరకూ వెళ్లి చతికిలబడటం వెనుక ఆ జట్టు ఆటగాళ్ల తప్పిదాలు ఒకటైతే, అంపైరింగ్‌ నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. కివీస్‌ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో భాగంగా 49 ఓవర్‌ నాల్గో బంతిని స్టోక్స్‌ లాంగాన్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టగా బౌండరీకి కొన్ని అంగుళాల ముందు బౌల్ట్‌ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే తనను తాను నియంత్రించుకోవడంలో విఫలమై బౌండరీ లైన్‌ తొక్కాడు. దాంతో ఔట్‌ కాస్తా సిక్స్‌ అయిపోయింది. ఇక చివరి ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఓవర్‌ త్రో రూపంలో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడంతో మ్యాచ్‌ టై అయ్యింది. ఫలితంగా సూపర్‌ ఓవర్‌ ఇంగ్లండ్‌ 15 పరుగులు చేస్తే, కివీస్‌ కూడా అన్నే పరుగులు స్కోరును సమం చేసింది. కాకపోతే బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు.

ఇదిలా ఉంచితే, సూపర్‌ ఓవర్‌ను తనకు ఇవ్వడంపై ఒకింత ఆందోళనకు గురైనట్లు జోఫ్రా ఆర్చర్‌ తెలిపాడు. ‘ నేను సూపర్‌ ఓవర్‌ వేయడానికి వెళ్లే ముందు స్టోక్స్‌ వచ్చి కూల్‌గా ఉండమని చెప్పాడు. నువ్వు గెలుపు-ఓటములు గురించి పట్టించుకోకు. అదేమే నీ ప్రతిభను తగ్గించదు అని ధైర్యం ఇచ్చాడు. ఆ సలహాతోనే నేను స్వేచ్ఛగా బౌలింగ్‌ వేశా. అదే సమయంలో జో రూట్‌ కూడా వచ్చి కొన్ని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాడు. నాపై ప్రతీ ఒక్కరూ నమ్మకం ఉంచడంతోనే నేను బౌలింగ్‌ను నియంత్రణతో వేశా. నేను ఒకటే అనుకున్నా. ఒకవేళ మేము ఓటమి పాలైతే ప్రపంచం అక్కడితో ఆగిపోదు అనే విషయం నాకు తెలుసు’ ఆర్చర్‌ తెలిపాడు. ఇక నా రెండు నెలల ఇంగ్లండ్‌ కెరీర్‌లో ఇదే అత్యుత్తమమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఒకటైతే, వరల్డ్‌కప్‌లో జట్టులోకి రావడం, వరల్డ్‌కప్‌లో ఆడటం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top