షమీని అరెస్ట్‌ చేసేలా సహకరించండి: హసీన్‌

Hasin Jahan Request To Media Help to Shami Case - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీని అరెస్ట్‌ చేసేలా సహకరించాలని అతని భార్య హసీన్‌ జహాన్‌ మీడియాకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె కోల్‌కతా మెజిస్ట్రేట్‌లో వాదనలు వినిపించే ముందు మీడియాతో మాట్లాడారు. 

‘నా కీర్తి, మర్యాదలను ఈ కేసులో ఫణంగా పెట్టి మరి పోరాడుతున్నాను. షమీ, అతని సోదరుడు నా పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికి కుటుంబం కోసం ఇన్నాళ్లు ఓపిక పట్టాను. షమీపై పోరాటం మొదలు పెట్టినప్పటి నుంచి మీడియా నన్ను పాయింట్‌ అవుట్‌ చేస్తోంది. ఈ హింసను ఓ మహిళగా నేనెందుకు తట్టుకోవాలి? చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి ఈ కేసులో నాకు మద్దతివ్వండి. ఎందుకంటే ఇది చిన్న కేసు కాదు. ఓ మహిళా గౌరవ, మర్యాదలపై జరుగుతున్న పోరాటం. షమీ నా గౌరవ, మర్యాదలను నాశనం చేశాడు.

షమీ నేరాల గురించి నేనొక్కదాన్నే గళం విప్పుతున్నాను. కానీ అతని చేతిలో మోసపోయిన అమ్మాయిలందరూ బయటకి రావడం లేదు. ఓ సెలబ్రిటి ఇలా చేయడం సబబేనా? నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. తన పట్ల వ్యతిరేక వార్తలు ప్రచారం చేయవద్దు. షమీని అరెస్టు చేసేలా నాకు మద్దతివ్వండి. నేనిప్పటికే చాలా భరించాను. దయచేసి నాబాధను అర్థం చేసుకొండి. నేను షమీని పెళ్లి చేసుకోకపోయినా నా జీవితం అద్భుతంగా ఉండేది. కానీ నాకు కావాల్సింది అది కాదు. నేను షమీతో ప్రేమలో ఉన్నప్పుడు కనీసం అతను జాతీయ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. ఈ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకొని నన్ను పాయింట్‌ అవుట్‌ చేయడం ఆపండి’ అని హసీన్‌ జహాన్‌ మీడియాను కోరారు.

ఇక షమీ గత నెలలో రెండు రోజుల పాటు దుబాయ్‌లో గడిపిన విషయాన్ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ధృవీకరించింది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులకు షమీ దక్షిణాఫ్రికా పర్యటన గురించి బీసీసీఐ వివరణ ఇస్తూ, అతను దుబాయ్‌లో గడిపిన విషయాన్ని స్పష్టం చేసింది. ఇక పాక్‌ యువతి అలీషబా సైతం స్పందించిన విషయం తెలిసిందే. షమీకి తాను కేవలం ఓ అభిమానిని మాత్రమేనన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top