
ఫేవరెట్‌గా హరికృష్ణ
ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య పసందైన పోరుకు రంగం సిద్ధమైంది.
షెన్‌జెన్ (చైనా): ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య పసందైన పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం మొదలయ్యే ప్రతిష్టాత్మక షెన్‌జెన్ లాంగ్‌గాంగ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ టోర్నమెంట్‌లో భారత స్టార్, ప్రపంచ 14వ ర్యాంకర్ పెంటేల హరికృష్ణతోపాటు మరో ఐదుగురు టైటిల్ కోసం పోటీపడనున్నారు. అనీశ్ గిరి (నెదర్లాండ్స్–11వ ర్యాంక్), మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్–12వ ర్యాంక్), డింగ్ లిరెన్ (చైనా–13వ ర్యాంక్), యు యాంగి (చైనా–18వ ర్యాంక్), పీటర్ స్విద్లెర్ (రష్యా–20వ ర్యాంక్) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్‌కు 20 వేల డాలర్లు (రూ. 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తుంది. ‘ఈ టోర్నీ నాకెంతో కీలకం. బరిలో ఉన్న అందరూ మేటి ఆటగాళ్లే. ఇటీవలే నేను టాప్–10లోకి రావడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు.