
దివంగత నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి (Nandamuri Harikrishna Birthday) సందర్భంగా ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్‌మీడియాలో ఒక నోట్ రాశారు. ట్విటర్ వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. "ఈ అస్థిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే - నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు" తమ అంటూ మనసులోని భావాలను వ్యక్తీకరించారు.
'మీ 69వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ.... మిస్ యూ నాన్న'! అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా బాధాతప్త హృదయంతో తండ్రిని స్మరించుకున్నారు. కాగా నందమూరి తారకరామారావు వారసుడిగా అటు నటుడిగానూ, ఇటు రాజకీయ నాయకుడిగానూ హరికృష్ణ అందరి మన్ననలు అందుకున్నారు. వెండితెరపై సీతయ్యగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
కాగా 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. అయితే, హరికృష్ణ మరణం తర్వాత ప్రతి ఏడాది ఎన్టీఆర్ ఇదే నోట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం తన తండ్రిపై ఉన్న అభిమానమే.. ఆయనపై ఉన్న అభిప్రాయం ఎప్పటికీ మారదనే సంకేతం ఇచ్చేలా అదే నోట్‌ను గత ఏడేళ్లుగా షేర్ చేస్తున్నారు.
మీ 69వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/vImZXQxr1L
— Jr NTR (@tarak9999) September 2, 2025