టీవీ ‘షో’లో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు

 Hardik Pandya, KL Rahul issued showcause notice - Sakshi

హార్దిక్‌ పాండ్యా, రాహుల్‌లకు బోర్డు షోకాజ్‌ నోటీసులు

సిడ్నీ/న్యూఢిల్లీ: టెలివిజన్‌ ‘షో’లో మహిళల్ని కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, లోకేశ్‌ రాహుల్‌లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీసుల్లో బోర్డు పేర్కొంది. ప్రముఖ  షో అయిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో వ్యాఖ్యాత కరణ్‌ జోహార్‌తో కలిసి ఈ ఇద్దరు క్రికెటర్లు పాల్గొన్నారు. ఇది ఇటీవలే ప్రసారమైంది. అందులో 25 ఏళ్ల ఆల్‌రౌండర్‌ పాండ్యా మాట్లా డుతూ ‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్‌ మై కర్‌ కే ఆయా’ (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని వ్యాఖ్యానించాడు.

18 ఏళ్ల వయసప్పుడే తన ప్యాంట్‌ జేబులో కండోమ్‌ లభించడాన్ని వాళ్ల అమ్మ తండ్రి దృష్టికి తీసుకెళ్లిందని,  మొదట మందలించినా... తర్వాత ‘పర్లేదు...రక్షణ కవచం వాడావు’ అని తండ్రి తనతో అన్నట్లు షోలో రాహుల్‌ చెప్పుకొచ్చాడు. కాంట్రాక్టు క్రికెటర్లయి ఉండి ఇలా అశ్లీల రీతిలో విచ్చలవిడితనంతో వ్యాఖ్యానించిన సదరు క్రికెటర్లకు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ నోటీసులు పంపారు. ఈ నోటీసులు రాగానే పాండ్యా ట్విట్టర్‌ వేదికగా మహిళలను క్షమాపణలు కోరాడు. ‘ఆ ఊపులో చెప్పేశాను. ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలి’ అని అన్నాడు. అయితే మరో క్రికెటర్‌ రాహుల్‌ మాత్రం ఇంకా స్పందించలేదు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top