గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నీ షురూ | Sakshi
Sakshi News home page

గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నీ షురూ

Published Thu, Feb 22 2018 10:34 AM

golkonda masters golf tourney started - Sakshi

గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ బుధవారం ప్రారంభమైంది. ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (పీజీటీఐ), హైదరాబాద్‌ గోల్ఫ్‌ సంఘం (హెచ్‌జీఏ) సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీ నాలుగు రోజుల పాటు జరుగనుంది. హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హెచ్‌జీఏ అధ్యక్షులు జె. విక్రమ్‌ దేవ్‌ రావు, కెప్టెన్‌ సి. దయాకర్‌ రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్‌ రావు, పీజీటీఐ సీఈఓ ఉత్తమ్‌ సింగ్, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఐఏఎస్‌ రష్మీ వర్మతోపాటు 123 మంది గోల్ఫ్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 30 లక్షలు.

ఇందులో భారత్‌కు చెందిన ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారులు ఖాలిన్‌ జోషి, చిక్కరంగప్ప, రాహిల్‌ గాంగ్జి, విరాజ్‌ మాడప్ప, హిమ్మత్‌ రాయ్, షమీమ్‌ ఖాన్, మాజీ చాంపియన్‌ హరేంద్ర గుప్తా, సయ్యద్‌ సకీబ్‌ అహ్మద్, ఉదయన్‌ మానే, హనీ బైసోయా సందడి చేయనున్నారు. వీరితో పాటు శ్రీలంకకు చెందిన అనురా రోహన, మిథున్‌ పెరీరా, ఎన్‌. తంగరాజ, కె. ప్రభాకరన్, దక్షిణాఫ్రికా నుంచి అల్బీ హనేకోమ్, బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్‌ జమాల్‌ హొస్సేన్, ఆస్ట్రేలియా నుంచి కునాల్‌ భాసిన్‌ ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సందర్భంగా హెచ్‌జీఏ అధ్యక్షుడు జె. విక్రమ్‌దేవ్‌ రావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక పీజీటీఐ టోర్నమెంట్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందన్నారు.  

Advertisement
Advertisement