
గౌతం గంభీర్
స్వప్న బర్మను చూస్తే రియల్ హీరోలు ఎవరో తెలుస్తోంది. నన్ను ఎవరైన ప్రశ్నిస్తే క్రికెటర్ల కన్నా వారే గొప్పవారని
న్యూఢిల్లీ : క్రికెటర్ల కన్నా ఇతర ఆటగాళ్లే రియల్ హీరోలని టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఏ మాత్రం పేరు, డబ్బులు రాకున్నా క్రికెటేతర ఆటగాళ్లు ఎన్నో సమస్యల మధ్య విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతాకాన్ని రెపరెపలాడించి అథ్లెట్స్ రియల్ హీరోలు అని అభివర్ణించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘క్రికెటేతర ఆటగాళ్లు ఆర్థికంగా, సౌకర్యాల పరంగా చాలా ఇబ్బంది పడుతారు. కానీ పతకాలు సాధించకపోతే ప్రజలు వారిని అసలు గుర్తించడం లేదు. ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. 69 పతకాలతో చరిత్ర సృష్టించారు. కానీ భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదు. క్రికెటరేతర ఆటగాళ్లకు అన్ని ప్రతికూల అంశాలే. స్వప్న బర్మను చూస్తే రియల్ హీరోలు ఎవరో తెలుస్తోంది. నన్ను ఎవరైన ప్రశ్నిస్తే క్రికెటర్ల కన్నా వారే గొప్పవారని చెబుతా. క్రికెటర్లే కాకుండా దేశం తరపున ఇతర ఆటగాళ్లు సైతం రాణిస్తున్నారు. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందించాలి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.