ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

Gambhir Defied ICC Decision To Announce The Winner Through Boundaries - Sakshi

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో విశ్వ విజేత ఎవరో తేలిపోయింది. లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం రోజున న్యూజిలాండ్‌తో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.  ఈ ఫైనల్‌కు ముందు మూడు సందర్భాల్లో అంతిమ సమరం వరకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయింది. కానీ నేటి విజయంతో ఇంగ్లండ్‌కి ఆ కల నెరవేరింది. అయితే, అంతకన్నా ముందుగా మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు హెన్రీ నికోల్స్ 55, టామ్ లాథం 47 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 241 పరుగులు సాధించింది. 242 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ 241 పరుగులకు ఆలౌట్‌ కావడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.(ఇక్కడ చదవండి: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌)

మ్యాచ్ టై అవడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఐసీసీ సూపర్ ఓవర్ నిర్వహించింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో 1 వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ సైతం మళ్లీ టైగానే మిగిలింది. ఇక సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ విశ్వ విజేతగా అవతరించింది. బౌండరీ కౌంట్ నిబంధనను 'హాస్యాస్పదంగా' ఉందని పేర్కొంటూ భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐసీసీపై విరుచుకుపడ్డాడు. అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ టై అయిన తర్వాత ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్‌ ఐసీసీ తీరును తప్పుపట్టారు. ఈ తరహా విధానం సరైనది కాదంటూ విమర్శించాడు.  ఇదొక చెత్త రూల్‌ అంటూ మండిపడ్డాడు. కాగా, మెగా ఫైట్‌లో కడవరకూ పోరాడిన ఇరు జట్లను గంభీర్‌ అభినందించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top