గంజి అన్నంతోనే గడిపాను...

Forced to eat rice porridge with pickle at 1984 Olympics Village - Sakshi

స్ప్రింట్‌ దిగ్గజం పీటీ ఉష

న్యూఢిల్లీ: పోషక విలువల్లేని ఆహారం వల్లే లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌ (1984)లో పతకం కోల్పోయానని పరుగుల రాణి పీటీ ఉష చెప్పారు. అక్కడి క్రీడా గ్రామంలోని స్థానిక వంటకాలు రుచించక గంజి అన్నం, పచ్చడి తినాల్సివచ్చిందని... ఇది తన ప్రదర్శనపై, చివరకు పతకంపై ప్రభావం చూపిందని గతానుభవాన్ని దిగ్గజ అథ్లెట్‌ వివరించింది. అప్పట్లో భారత క్రీడాకారులకు అంతంత మాత్రం క్రీడాపరికరాలు, సదుపాయాలు అందుబాటులో ఉండేవని చెప్పారు. విదేశీ క్రీడాకారులు అన్ని హంగులతో, ఆధునిక కిట్లతో కనిపిస్తుంటే తమకు విచారంగా ఉండేదన్నారు.

‘ఏం చేస్తాం! ఒక్క రోజైన అలాంటి కిట్లతో బరిలోకి దిగితే అదే మహాభాగ్యమనిపించేది అప్పుడు. అక్కడి ఆహారం గురించి మాకెలాంటి సమాచారం లేదు. కేవలం స్థానిక పదార్థాల్నే (లాస్‌ ఏంజిల్స్‌) వండి వార్చేవారు. బేక్‌ చేసిన ఆలుగడ్డలు, సోయా సాస్‌తో సగం ఉడికించిన చికెన్‌ మాకు ఏమాత్రం రుచించలేదు. దీంతో నేను గంజి అన్నం, పచ్చడితో సరిపెట్టుకున్నా. అది అథ్లెట్లు తీసుకునే భోజనం కానేకాదు. అందులో ఎలాంటి పోషకాలు ఉండవు. కానీ నాకు తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నా. అలాగే 400 మీ. హర్డిల్స్‌ బరిలోకి దిగాను. సెకనులో వందో వంతు తేడాతో కాంస్యాన్ని కోల్పోయాను’ అని ఉష ఆనాటి సంగతుల్ని వివరించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top