'ఫ్రీడమ్‌' ఎవరి సొంతం! | The first Test match from today | Sakshi
Sakshi News home page

'ఫ్రీడమ్‌' ఎవరి సొంతం!

Jan 5 2018 12:29 AM | Updated on Sep 18 2018 8:48 PM

The first Test match from today - Sakshi

భారత జట్టు ఆఖరి సారిగా మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో ఓడింది. ఆ తర్వాత సొంతగడ్డపై ఆరు సిరీస్‌లు గెలిస్తే, మరో రెండు శ్రీలంకలో, ఒకటి బలహీన విండీస్‌లో నెగ్గింది. అయితే ఇదంతా ఒక ఎత్తు... ఇప్పుడు ఆడబోయే పరిస్థితులు మరొక ఎత్తు. కొత్త సంవత్సరంలో దక్షిణాఫ్రికా రూపంలో మన ఎదురుగా కొత్త సవాల్‌ నిలిచింది. పాతికేళ్లలో సాగిన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా సిరీస్‌ గెలవలేని సఫారీ మైదానాల్లో మన అసలు సత్తాకు పరీక్ష ఎదురు కాబోతోంది. 

మీ గల్లీలో కొట్టడం కాదు... మా గల్లీకి రా చూసుకుందాం... దక్షిణాఫ్రికా ఆటగాళ్ల మనసులో సరిగ్గా ఇప్పుడు ఇదే ఆలోచన కొనసాగుతున్నట్లుంది. రెండేళ్ల క్రితం భారత్‌లో 0–3తో చిత్తుగా ఓడిన ఆ జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పుడు ప్రతీకారానికి సిద్ధమయ్యారు. తమ పిచ్‌లతో పాటు పేస్‌ బౌలర్లను కూడా ఆ జట్టు బలంగా నమ్ముకుంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై సఫారీల జోరుకొనసాగుతుందా లేక భారత్‌ తమ పాత రికార్డును సవరిస్తూ సంచలనం సృష్టిస్తుందా అనేది ఆసక్తికరం.

కేప్‌టౌన్‌: పేరుకే ఇది శాంతి దూతలు మహాత్మా గాంధీ–నెల్సన్‌ మండేలా సిరీస్‌... గెలిచే జట్టు నిలబెట్టుకునేది ‘ఫ్రీడమ్‌’ ట్రోఫీనే కావచ్చు... కానీ పోరులో మాత్రం హోరాహోరీ తప్పదు. క్రికెట్‌ అభిమానులకు వరల్డ్‌ టాప్‌–2 జట్లు అందించే అసలైన టెస్టు వినోదానికి నేటితో తెర లేవనుంది. దక్షిణాఫ్రికా గడ్డపై 2010లో ఒక టెస్టులో విజయం సహా సిరీస్‌ను సమం చేసిన టీమిండియా... 2013లో ఒక టెస్టులో విజయానికి అతి చేరువగా వచ్చి త్రుటిలో ఆ అవకాశం కోల్పోయింది. అయితే ఇప్పుడు అన్ని రంగాల్లో మరింత పటిష్టంగా మారిన కోహ్లి సేన అంతకంటే మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. ఇలాంటి స్థితిలో దక్షిణాఫ్రికాతో నేటి నుంచి ఇక్కడి న్యూల్యాండ్స్‌ మైదానంలో తొలి టెస్టు జరగనుంది. తర్వాతి రెండు టెస్టులు జరిగే మైదానాలతో పోలిస్తే ప్రస్తుతం భారత్‌కు కాస్త అనుకూలంగా కనిపిస్తున్న ఈ చోట తొలి టెస్టు గెలవగలిగితే సిరీస్‌లో భారత్‌కు తిరుగుండదు. మరోవైపు కీలక సిరీస్‌లో సఫారీ జట్టు తమ అసలు సత్తాను ప్రదర్శించేందుకు సన్నద్ధమైంది.  

జోరు కొనసాగేనా... 
వేదిక మారినా ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే భారత తుది జట్టు విషయంలో భారీ మార్పులకు పెద్దగా అవకాశం లేదు. 2017లో అత్యద్భుత ఆటతో పలు రికార్డులు కొల్లగొట్టిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి ముందుండి జట్టును నడిపించాల్సి ఉంది. అతనితో పాటు గత సిరీస్‌లో సఫారీ గడ్డపై రాణించిన పుజారా, రహానేలపై మరోసారి కీలక బాధ్యతలు ఉన్నాయి. వీరంతా సఫారీ పేసర్లను సమర్థంగా ఎదుర్కోగలిగితే భారత్‌కు సిరీస్‌లో శుభారంభం లభిస్తుంది. ఓపెనర్లలో విజయ్‌ ఖాయం కాగా.... బుధవారం సాగిన ప్రాక్టీస్‌ను బట్టి చూస్తే మేనేజ్‌మెంట్‌ ధావన్‌కంటే రాహుల్‌ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక ఆరో స్థానంలో ప్రధాన బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. మ్యాచ్‌ సమయానికి పిచ్‌ పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటారు. వికెట్‌ గనుక బౌలింగ్‌కు అనుకూలించే విధంగా ఉంటే ముగ్గురు ప్రధాన పేసర్లు ఎలాగూ జట్టులో ఉంటారు కాబట్టి బ్యాటింగ్‌ను పటిష్టం చేసుకునేందుకు రోహిత్‌కు అవకాశం ఇచ్చే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉంది. షమీ, ఇషాంత్‌లతో పాటు ఇక్కడి వాతావరణంలో ప్రమాదకారి కాగల భువనేశ్వర్‌కే స్థానం లభించవచ్చు. అనుభవంపరంగా కూడా దక్షిణాఫ్రికాతో పోటీ పడుతున్న మన పేసర్లపై అదనపు భారం ఉంది. పటిష్టమైన ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌ను వీరు దెబ్బ తీయాల్సి ఉంటుంది. అనారోగ్యంతో జడేజా తప్పుకోవడంతో ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌కు చోటు ఖాయం. గత పర్యటనలో ఇక్కడ ఆడిన ఒకే టెస్టులో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన అశ్విన్‌ తాజా ఫామ్‌తో నాటి రికార్డును సరిదిద్దాలని భావిస్తున్నాడు.  

పేస్‌ బలగంతో... 
దక్షిణాఫ్రికాకు కూడా తుది జట్టు ఎంపిక విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా...ఆ జట్టుకు ఇది సమస్య కాబోదు. భిన్నమైన బౌలింగ్‌ శైలి గల ముగ్గురు పేసర్లు మోర్కెల్, ఫిలాండర్, రబడ సొంతగడ్డపై చెలరేగేందుకు సిద్ధమైపోయా  రు. స్టెయిన్‌కు అవకాశం లేదని ఇప్పటికే తేలిపోయింది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ భారత బ్యాటింగ్‌పై ఏమాత్రం ప్రభావం చూపించగలడో చూడాలి. బ్యాటింగ్‌ విషయంలో కూడా దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపిస్తోంది. ఫామ్‌లో ఉన్న మర్‌క్రమ్, 2017లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న ఎల్గర్‌లతో ఓపెనింగ్‌ జోడి పటిష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమ్లా, డు ప్లెసిస్‌లపై బ్యాటింగ్‌ భారం ఉంది. అయితే టెస్టుల్లో టాప్‌ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు ఉన్న ఆమ్లా కొంత కాలంగా విఫలమవుతుండటం సఫారీలను ఆందోళన పరిచే అంశం. జింబాబ్వేతో జరిగిన టెస్టుతో పునరాగమనం చేసినా డివిలియర్స్‌ బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేదు. ఇక ఆరో స్థానంలో డి కాక్‌లాంటి ఆటగాడు ఆ జట్టుకు అదనపు బలం.  

భారత్‌తో తర్వాతి సిరీస్‌ ఎప్పుడు ఉంటుందో నాకు తెలీదు. కానీ మా సీనియర్‌ ఆటగాళ్లంతా భారత్‌తో తలపడటం ఇదే ఆఖరిసారి కావచ్చు. అలాంటప్పుడు దక్షిణాఫ్రికాలో ఆడటంకంటే మంచి అవకాశం మళ్లీ రాదు. మా గత పర్యటనలో మేం ఎంతో నిరాశగా వెనుదిరిగాం. కాబట్టి లెక్క సరి చేయాలని పట్టుదలగా ఉన్నాం. పిచ్‌ కూడా మేం ఆశించినట్లుగానే ఉంది. 
– డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్‌ 

తుది జట్ల వివరాలు (అంచనా)  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), విజయ్, ధావన్‌/రాహుల్, పుజారా, రహానే, రోహిత్‌/పాండ్యా, సాహా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఇషాంత్‌. 
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), ఎల్గర్, మర్‌క్రమ్, ఆమ్లా, డివిలియర్స్, డి కాక్, ఫెలుక్‌వాయో/మోరిస్, ఫిలాండర్, రబడ, మోర్కెల్, మహరాజ్‌.  

పిచ్,  వాతావరణం 
వికెట్‌పై పచ్చిక కనిపిస్తోంది. బౌన్స్‌కు కూడా అవకాశం ఉంది. అప్పటికప్పుడు మారిపోయే వాతావరణం వల్ల టాస్‌ గెలిచిన జట్టు కూడా దేనిని ఎంచుకోవా లో సందిగ్ధపడే పరిస్థితి. అయినా సరే ముందుగా బ్యాటింగ్‌ చేయడమే మెరుగైన ప్రత్యామ్నాయం. ఐదు రోజుల్లో కొన్నిసార్లు వర్ష సూచన ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement