
విరాట్ సేనకు భారీ లక్ష్యం
భారత్ తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
పుణె: భారత్ తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆది నుంచి దూకుడును కొనసాగించింది. ఇంగ్లండ్ ఓపెనర్ హేల్స్(9)ఆదిలో పెవిలియన్ చేరినప్పటికీ, మరో జాసన్ రాయ్(73;61 బంతుల్లో 12 ఫోర్లు) రాణించాడు. అతనికి జతగా జో రూట్(78;95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) లు బాధ్యతాయుతంగా ఆడగా, మిగతా ఆటగాళ్లు మోర్గాన్(28), బట్లర్(31),లు ఫర్వాలేదనిపించారు.
స్టోక్స్ స్ట్రోక్..
ఇంగ్లిష్ విధ్వంసకర ఆటగాడు బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ భారత్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఈ క్రమంలోనే 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థ శతకం సాధించాడు. దాంతో ఇంగ్లండ్ 46.0 ఓవర్లు ముగిసే సరికి 300 పరుగుల మార్కును దాటింది. స్టోక్స్ విధ్వంసానికి మొయిన్ అలీ(28) చక్కటి సహకారం అందించాడు. ఒకవైపు అలీ వికెట్ ను కాపాడకుంటూ ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. అదే క్రమంలో వన్డేల్లో భారత్ పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. గతంలో ఓవై షా, ఫ్లింటాఫ్లు భారత్ పై 35 బంతుల్లో వేగవంతమైన అర్థ శతకాలు సాధించిన రికార్డును స్టోక్స్ చెరిపేశాడు. 40 బంతుల్లో 62 పరుగులు చేసిన తరువాత స్టోక్స్ ను బూమ్రా అవుట్ చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు ఓపెనర్ జాసన్ రాయ్ చక్కటి ఆరంభాన్నిచ్చాడు. జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ క్రమంలోనే రాయ్ 36 బంతుల్లో 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే రూట్ తో కలిసి 69 పరుగులు జోడించిన తరువాత రాయ్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై ఇంగ్లిష్ ఆటగాళ్లు తమ వంతు బాధ్యతను సమర్ధవంతంగా ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా,హార్థిక పాండ్యాలకు తలోరెండు వికెట్లు లభించగా,ఉమేష్ యాదవ్,.జడేజాలకు చెరో వికెట్ దక్కింది.
చివర్లో ఇంగ్లండ్ పవర్ పంచ్
ఇంగ్లండ్ చివరి ఓవర్లలో చెలరేగి ఆడింది. ప్రధానంగా ఆఖరి ఐదు ఓవర్లలో స్టోక్స్-మొయిన్ అలీలు ఇంగ్లండ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ విలువైన పరుగుల్ని పిండుకుంది. ఈ జోడి సహకారంతో ఆఖరి ఐదు ఓవర్లలో ఇంగ్లండ్ 65 పరుగుల్ని రాబట్టింది. 45.0 ఓవర్లలో 285 పరుగులు చేసిన ఇంగ్లండ్.. 50 ఓవర్లు ముగిసే సరికి 350 పరుగులకు చేరిందంటూ ఆ జట్టు ఎంత దూకుడుగా ఆడిందో అర్ధం చేసుకోవచ్చు.