ఇంగ్లండ్‌తో రెండో వన్డే: టీమిండియా జోరుకు బ్రేక్‌ | England Beat By 86 Runs In 2nd OdI Against Team India | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో రెండో వన్డే: టీమిండియా జోరుకు బ్రేక్‌

Jul 14 2018 11:39 PM | Updated on Jul 15 2018 12:12 AM

England Beat By 86 Runs In 2nd OdI Against Team India - Sakshi

భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు

లార్డ్స్‌: టీమిండియా జోరుకు బ్రేక్‌ పడింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో 86 పరుగుల తేడాతో కోహ్లి సేన ఘోర ఓటమి చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1-1తో సమం చేసింది. మొదట బౌలింగ్‌లో ధారళంగా పరుగులిచ్చి.. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు సరైన భాగస్వామ్యం అందించలేకపోయారు. తొలి వన్డే సెంచరీ హీరో రోహిత్‌ శర్మ (15) మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌(0) దారుణంగా విఫలమయ్యాడు. ఇక మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 36 (30 బంతుల్లో 6ఫోర్లు) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. ఈ క్రమంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిరువురు నాలుగో వికెట్‌కు 80 పరుగులు నమోదు చేసిన తర్వాత కోహ్లి 45(56 బంతుల్లో 2 ఫోర్లు)ని మొయిన్‌ ఆలీ ఔట్‌ చేశాడు. అనంతరం రైనా 46 (63 బంతుల్లో 1ఫోర్‌)కూడా నిష్క్రమించడంతో భారత్‌ ఓటమి దిశగా పయనించింది. ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో రన్‌రేట్‌ పెరిగిపోయింది. మరోవైపు ధోని, పాండ్యా పరుగులు చేయడానికి నానాకష్టాలు పడ్డారు. ఒత్తిడికి గురైన పాండ్యా 21(22 బంతుల్లో 1 ఫోర్‌) ప్లంకెట్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌ డకౌటయ్యాడు .

ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని 33 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ చేరగానే వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి చేశాడు. మరో నాలుగు పరుగులు జోడించిన అనంతరం ధోని 37(59 బంతుల్లో 2ఫోర్లు) ప్లంకెట్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత్‌ ఓటమి ఖరారైంది. ఇక టెయిలెండర్లు కూడా రాణించకపోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ప్లంకెట్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా, అదిల్‌ రషీద్‌, విల్లే చెరో రెండు వికెట్లు.. వుడ్‌, మెయిన్‌ అలీ తలో వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌ మంగళవారం(జులై 17)న జరగనుంది. 

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌.. బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్‌ సాధించింది. జోయ్‌ రూట్‌ 113(116 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ మోర్గాన్‌ 53 (51 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో డేవిడ్‌ విల్లే 50(31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్‌) మెరుపులు మెరిపివ్వడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీయగా.. చహల్‌, ఉమేశ్‌, పాండ్యా తలో వికెట్‌ పడగొట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement