ఏడాది తర్వాత బ్రేవో యూటర్న్‌

Dwayne Bravo Makes U Turn On Retirement, Available For T20s - Sakshi

విండీస్‌ తరఫున మళ్లీ ఆడాలని ఉంది

ఆంటిగ్వా:  అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడాదికి పైగా దాటిన తర్వాత వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో యూటర్న్‌ తీసుకున్నాడు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. ప్రత్యేకంగా టీ20 సెలక్షన్స్‌కు తాను కూడా అందుబాటులో ఉంటానంటూ వెల్లడించాడు. ‘ నాకు అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయాలని ఉంది. ఈ విషయాన్ని నా అభిమానులకు నా మంచి కోరుకునే వారికి తెలియజేస్తున్నా. నా రిటైర్మెంట్‌పై యూటర్న్‌ తీసుకోవడానికి కారణం ఒక్కటే. మా క్రికెట్‌ బోర్డు పరిపాలనలో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

దాంతోనే నా రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నా. ఇందులో సీక్రెట్‌ ఏమీ లేదు. బోర్డు పెద్దల వ్యవహారం సరిగా లేని కారణంగానే నేను అప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగాల్సి వచ్చింది. ఇప్పుడు పాలన మారడంతో నా మనసు కూడా మార్చుకున్నా’ అని బ్రేవో తెలిపాడు. గతేడాది  బ్రేవో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  2012, 2016ల్లో విండీస్‌ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో బ్రేవో సభ్యుడు. 2016 సెప్టెంబర్‌లో విండీస్‌ జెర్సీలో బ్రేవో చివరిసారి కనిపించాడు.

విండీస్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేస్తూ వచ్చిన బ్రేవో తన రిటైర్మెంట్‌ను  2018 అక్టోబర్‌లో ప్రకటించాడు.  ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్న బ్రేవో.. బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ విదేశీ లీగ్‌లో బ్రేవో అలరిస్తూనే ఉన్నాడు. కాగా, ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా విండీస్‌ రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో బ్రేవోను చేర్చారు. కాకపోతే బ్రేవోకు ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుత నిర్ణయంతో విండీస్‌ తరఫున ఆడే అవకాశాన్ని సెలక్టర్లు ఇస్తారో లేదో చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top