మైదానంలో నిద్రపోయిన ధోని!

పల్లెకెలె: శ్రీలంక పర్యటనలో భాగంగా మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్డేడియంలో హాయిగా నిద్రించాడు. అదేంటి.. మ్యాచ్ మధ్యలో నిద్రేంటి అనుకుంటున్నారా..! లంక నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 44 ఓవర్లలో 210 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీ (122 నాటౌట్), ధోని (61 నాటౌట్) క్రీజులో ఉన్న సమయంలో భారత్ విజయాన్ని తట్టుకోలేని స్డేడియంలోని లంక అభిమానులు మైదానంలోకి బాటిళ్లు విసరడం ప్రారంభించారు.

పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అరుస్తూ బాటిళ్లు, తమ చేతిలోని వస్తువులను మైదానంలోకి విసురుతూ ఆటకు అంతరాయం కలిగించారు. కొందరు గ్రౌండ్ సిబ్బంది సాయంతో బాటిళ్లు, ఇతరత్రా వస్తువులను తొలగించారు. బాటిళ్లు తీసేసిన తర్వాత కూడా మ్యాచ్ జరగడంపై స్పష్టత లేకపోవడంతో రోహిత్, ధోనిలు కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యారు. ఎంతకూ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయం తేలకపోవడంతో ధోని కొద్దిసేపు హాయిగా నిద్రిస్తూ కనిపించాడు. కూల్ ప్లేయర్ గా ముద్రపడ్డ ధోని, లంక అభిమానుల చేష్టలకు అసలు కాస్త కూడా అసహనానికి గురికాలేదు. ఫీల్డ్ అంపైర్లు కాసేపు చర్చించి ఆటను తాత‍్కాలికంగా నిలిపివేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూము వైపునకు వెళ్లారు.

పరిస్థితి సద్దుమణిగిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. విజయానికి అవసరమైన 8 పరుగులను మరో ఏడు బంతుల్లో చేసిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో మూడో వన్డే నెగ్గింది. దీంతోపాటు ఐదు వన్డేల సిరీస్ ను కూడా కోహ్లీసేన సొంతం చేసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top