సూపర్... యూకీ | Devvarman, Bhambri wins help India beat New Zealand in Davis Cup | Sakshi
Sakshi News home page

సూపర్... యూకీ

Jul 20 2015 12:29 AM | Updated on Sep 3 2017 5:48 AM

సూపర్... యూకీ

సూపర్... యూకీ

చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ అద్వితీయ ఆటతీరుతో అలరించాడు. వరుస సెట్‌లలో విజయాన్ని

 రివర్స్ సింగిల్స్‌లోనూ విజయం
 వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు భారత్ అర్హత
 న్యూజిలాండ్‌పై 3-2తో గెలుపు

 
 క్రైస్ట్‌చర్చ్: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ అద్వితీయ ఆటతీరుతో అలరించాడు. వరుస సెట్‌లలో విజయాన్ని సాధించి టీమిండియాను మరోసారి డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు చేర్చాడు. యూకీ బాంబ్రీ గెలుపు కారణంగా న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో భారత్ 3-2 తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన తొలి రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 6-4, 6-4, 6-4తో మార్కస్ డానియల్ (న్యూజిలాండ్)ను ఓడించడంతో భారత్ స్కోరును 2-2తో సమం చేసింది.
 
  ఇక నిర్ణాయక రెండో రివర్స్ సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ 6-2, 6-2, 6-3తో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)పై గెలుపొందడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివెరిసింది. తొలి రోజు శుక్రవారం జరిగిన సింగిల్స్‌లో సోమ్‌దేవ్ ఓడిపోగా, యూకీ గెలిచి స్కోరును 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట ఓటమి చెందడంతో ఆదివారం నాటి రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఆటగాళ్లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యూకీ బాంబ్రీ ఒత్తిడిని అధిగమించి అలవోక విజయాలు సాధించి భారత్‌ను గట్టెక్కించారు.
 
 ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యూకీ కేవలం గంటా 49 నిమిషాల్లో వీనస్ ఆట కట్టించాడు. ఆరు ఏస్‌లు సంధించిన ఈ భారత రెండో ర్యాంకర్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన డబుల్స్ భాగస్వామిగా ఉన్న వీనస్ ఆటతీరుపై మంచి అవగాహన ఉండటంతో యూకీ ప్రణాళికతో ఆడి ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. వీనస్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన యూకీ తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోకపోవడం విశేషం. మొత్తానికి ఆడిన రెండు సింగిల్స్‌లలోనూ యూకీ వరుస సెట్‌లలోనే గెలిచి ఈ పోటీలో భారత్ తరఫున ‘హీరో’ అయ్యాడు.
 
 అంతకుముందు తొలి రివర్స్ సింగిల్స్‌లో జ్వరం కారణంగా కివీస్ ప్లేయర్ జోస్ స్థాతమ్ బరిలోకి దిగకపోవడంతో అతని స్థానంలో మార్కస్ డానియల్‌ను ఆడించారు. భారీ సర్వీస్‌లతో డానియల్ హడలెత్తించినా కీలకదశల్లో అతని సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన సోమ్‌దేవ్ విజయాన్ని దక్కించుకున్నాడు. ‘యూకీ ఇంత బాగా ఆడటాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఇదో గొప్ప విజయం’ అని భారత జట్టులోని సీనియర్ సభ్యుడు రోహన్ బోపన్న ప్రశంసించాడు. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఈ ఏడాది సెప్టెంబరులో ఉంటుంది. స్విట్జర్లాండ్, జపాన్, అమెరికా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, బ్రెజిల్, క్రొయేషియా, ఇటలీ జట్లలో నుంచి ఒక జట్టు భారత ప్రత్యర్థిగా ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement