ఢిల్లీ లక్ష్యం 84

Delhi vs Hyderabad Ranji Match At New Delhi - Sakshi

హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓటమి అంచున నిలిచింది. ఫాలోఆన్‌ ఆడిన హైదరాబాద్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటై... 84 పరుగుల విజయలక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. ఢిల్లీ శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 7 ఓవర్లలో 24 పరుగులు చేసింది. కునాల్‌ (6), శిఖర్‌ ధావన్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 20/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ను ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (154 బంతుల్లో 103; 13 ఫోర్లు, 1 సిక్స్‌) శతకంతో ఆదుకున్నాడు. 97 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ పరాభవం తప్పదనుకున్న స్థితిలో... తన్మయ్‌  టెయిలెండర్లతో పలు కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. తనయ్‌ త్యాగరాజన్‌ (70 బంతుల్లో 34; 6 ఫోర్లు)తో కలిసి 7వ వికెట్‌కు 93 పరుగులు... మెహదీ హసన్‌ (62 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి 8వ వికెట్‌కు 60 పరుగులు జోడించి హైదరాబాద్‌కు ఇన్నింగ్స్‌ ఓటమిని తప్పించాడు. ఇషాంత్‌ శర్మ 4 వికెట్లతో రాణించాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top