
న్యూఢిల్లీ: ఈ రోజు భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా మూడేళ్ల క్రితం శ్రీలంకపై రోహిత్ శర్మ ఆడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది. 2014, నవంబర్ 13వ తేదీన కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో లంకేయులతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. తనదైన శైలిలో లంక బౌలింగ్ ఉతికి ఆరేసిన రోహిత్.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. దాదాపు 225 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్న రోహిత్ శర్మ బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో నిలిచాడు.
ఇదే ఇప్పటికీ వన్డేల్లోఅత్యధిక స్కోరు. ఆ మ్యాచ్ లో భారత జట్టు 153 పరుగుల తేడాతో లంకపై గెలిచింది. వన్డే ఫార్మాట్ లో రెండు సార్లు డబుల్ సెంచరీ చేసిన ఘనత రోహిత్ శర్మదే కావడం మరో విశేషం. 2013లో నవంబర్ 2వ తేదీన బెంగళూరులో ఆసీస్ తో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ(209) తొలి డబుల్ సెంచరీ చేశాడు. ఆపై ఏడాది కాలంలోనే మరో డబుల్ సెంచరీ రోహిత్ ఖాతాలో చేరడం విశేషం. భారత్ తరపున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మతో పాటు వీరేంద్ర సెహ్వాగ్(219), సచిన్ టెండూల్కర్(200 నాటౌట్)లు ఉన్నారు.