చెన్నై.. విజిల్‌ పొడూ మా..!!

CSK Players Reactions on Their Wonderful Winning in IPL 2018 - Sakshi

సాక్షి, ముంబై : రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్ మరోసారి సత్తా చాటింది. మిస్టర్‌ కూల్‌ ధోని కెప్టెన్సీలో సగర్వంగా మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకుంది. హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌లు చూడలేకపోయామనే తమిళ అభిమానుల బాధను టైటిల్‌ సాధించి ఇట్టే మాయం చేసి.. వారి చేత విజిల్స్‌ వేయించింది. సీనియర్ల జట్టు అంటూ ఎగతాళి చేసిన వారి ముందే గెలిచి నిలిచింది. అంతేకాకుండా కొత్తగా జట్టులో చేరిన ముంబై మాజీ ఆటగాళ్లు హర‍్భజన్‌, అంబటి రాయుడులకు నాలుగోసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచామనే అనుభూతిని అందించింది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న ధోనీ జట్టుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. జట్టులో భాగస్వాములైన చెన్నై ఆటగాళ్ల విజయానందం వారి మాటల్లోనే..

అంబటి రాయుడు
చెన్నై జట్టుకు ఆడడం అదృష్టంగా  భావిస్తున్నాను. కష్టపడినందుకు ఫలితం దక్కింది. తొలుత వికెట్‌ కొంచెం నెమ్మదించింది. కానీ తర్వాత అంతా సర్దుకుంది. ఈ విజయంలో నా వంతు పాత్ర పోషించడం  ఎంతో సంతోషాన్నిచ్చింది.

రవీంద్ర జడేజా
చాంపియన్స్‌ టీమ్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌లో మా ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది. రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మేము చాంపియన్లుగా ఈ సీజన్‌కి ముగింపు పలికాము.

లుంగి ఎంగిడి
డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం బాధ్యతతో కూడుకున్నది. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. ఈ మ్యాచ్‌ చాలా అద్భుతంగా సాగింది. అద్భుతమైన ఈ విజయాల్లో భాగస్వాములయ్యే అవకాశం అందరికీ రాదు. ప్రస్తుతం నేను ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాను.

హర్భజన్‌ సింగ్‌
ఇది నాకు నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌. అద్భుతమైన ఛేజింగ్‌ ద్వారా మేము విజయాన్ని దక్కించుకున్నాము. ధోని వ్యూహాల్ని చక్కగా అమలు చేశాడు. ఫింగర్‌ స్పిన్నర్‌తో పోల్చినపుడు ఐపీఎల్‌లో రిస్ట్‌ స్పిన్నర్స్‌కే ఎక్కువగా బౌలింగ్‌ చేసే అవకాశం లభిస్తోంది. వచ్చే సీజన్‌ నుంచి ఈ ఆనవాయితీ మారుతుందనుకుంటా. కర్ణ్‌ శర్మచాలా బాగా ఆడాడు.

డ్వేన్‌ బ్రావో
ఇదొక ప్రత్యేకమైన సందర్భం. రెండేళ్లుగా ఒక్కొక్కరం ఒక్కో టీమ్‌లో ఉన్నాం. సీఎస్‌కే పునరాగమనం ద్వారా మళ్లీ ఒక చోటికి చేరాం. ఈ టీమ్‌లో కొందరు కొత్త ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఒక ఆటగాడికి అనుభవం అనేది ఎంత ముఖ్యమో వాట్సన్‌ మరోసారి నిరూపించాడు. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. వట్టూ నీ ఇన్నింగ్స్‌ ఎంతో ప్రత్యేకం.

శార్దూల్‌ ఠాకూర్‌
గతేడాది ఐపీఎల్‌ ఫైనల్‌లో(రైజింగ్‌ పుణె తరపున) ఆడే అవకాశం లభించింది. కానీ టైటిల్‌ సాధించలేకపోయాం. ప్రస్తుతం ఈ విజయంతో నాకు ప్రపంచాన్ని జయించినట్టుగా ఉంది. ఇదే ఆఖరు మ్యాచ్‌.. కనుక డెత్‌ ఓవర్లలో బాగా బౌలింగ్‌ చేయాలనే ఆలోచనతో నా మైండ్‌ నిండిపోయింది. నా ప్రణాళికను చక్కగా అమలు చేయడం ద్వారా టాప్‌ విన్నింగ్‌లో భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top