ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడతాం

COA Seeks Govt Permission to Host Pakistan Women - Sakshi

పాక్‌తో సిరీస్‌పై సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ వ్యాఖ్య

ముంబై: ఐసీసీ మహిళల వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌– పాకిస్తాన్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) అధ్యక్షుడు వినోద్‌ రాయ్‌ స్పష్టం చేశారు. 2021 ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ అయిన ఐసీసీ మహిళల వన్డే చాంపియన్‌షిప్‌ నేపథ్యంలో భారత్‌ వేదికగా పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. జూలై నుంచి నవంబర్‌ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లను నిర్వహించడానికి అనుమతి కోసం భారత క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ లేఖ రాసింది.

దీనిపై రాయ్‌ స్పందిస్తూ ‘భారత్‌ వేదికగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు నిర్వహించాల్సి వచ్చిన ప్రతిసారి మేం ప్రభుత్వ అనుమతిని కోరతాం. ఈ విషయంలో వారి వైఖరికే మేం ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ అంశంపై ఎలాంటి వివరణ రాలేదు. ముందు దీనిపై ప్రభుత్వాన్ని స్పందించనివ్వండి. తర్వాత మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’ అని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2013 జనవరి నుంచి పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత్‌ దూరంగా ఉంటోంది. కానీ ఐసీసీ ఈవెంట్ల సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌ తటస్థ వేదికలపై పాకిస్తాన్‌తో ఆడుతోంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top