మరిన్ని చిక్కుల్లో షమీ!

CoA asks ACU to investigate fixing charges against Mohammed - Sakshi

‘ఫోన్‌ కాల్‌’పై విచారణ జరపాలని సీఓఏ ఆదేశం

న్యూఢిల్లీ: భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ కష్టాలు మరిన్ని పెరిగాయి. భార్య హసీన్‌ జహాన్‌ గృహహింస ఆరోపణలు, బీసీసీఐ కాంట్రాక్ట్‌ నిలిపివేత, పోలీసు కేసుల నమోదు అనంతరం ఇప్పుడు క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) రంగంలోకి దిగింది. హసీన్‌ చేసిన ఆరోపణల్లో ‘టెలిఫోన్‌ సంభాషణ’పై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ నీరజ్‌ కుమార్‌ను సీఓఏ చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ ఆదేశించారు. వారం రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. అయితే నీరజ్‌కు ఇచ్చిన ఈ ఆదేశాల్లో ఎక్కడా ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అనే పదం మాత్రం వాడలేదు. ఇంగ్లండ్‌కు చెందిన వ్యాపారవేత్త మొహమ్మద్‌ భాయ్‌ చెప్పడంతో అలీస్బా అనే పాకిస్తాన్‌ మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడని ఆ ఫోన్‌కాల్‌లో హసీన్‌ ఆరోపించింది.

‘షమీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నాం. షమీ, అతని భార్యకు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణను మేం విన్నాం. బయట కూడా అది అందుబాటులో ఉంది. ఈ ఒక్క అంశంలో మాత్రమే విచారణ చేస్తాం. కేసుకు సంబంధించిన ఇతర విషయాల జోలికి వెళ్లదల్చుకోలేదు’ అని రాయ్‌ వ్యాఖ్యానించారు. మొహమ్మద్‌ భాయ్, అలీస్బా ఎవరు, నిజంగానే వారి నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడా, ఒక వేళ తీసుకుంటే ఎందుకు తీసుకున్నాడు అనే మూడు విషయాలపై విచారణ జరిపి నీరజ్‌ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top