
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్ ఐదో రౌండ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజయం సాధించాయి. భారత పురుషుల జట్టు 3.5–0.5తో పరాగ్వేపై... మహిళల జట్టు 3.5–0.5తో అర్జెంటీనాపై గెలుపొందాయి. విశ్వనాథన్ ఆనంద్ 26 ఎత్తుల్లో రమిరెజ్ డెల్గాడోపై... ఆధిబన్ 35 ఎత్తుల్లో అల్మిరాన్‌పై... శశికిరణ్ 35 ఎత్తుల్లో వెర్జివ్‌కర్‌పై నెగ్గగా; గిలెర్మోతో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 52 ఎత్తుల్లో కరోలినా లుజాన్‌పై... తానియా సచ్‌దేవ్ 36 ఎత్తుల్లో ఫ్లోరెన్సియాపై... ఇషా కరవాడే 35 ఎత్తుల్లో ఐలెన్‌పై విజయం సాధించగా... క్లాడియా అమూరాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.