ప్రతీ ఏడాది జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించడం... ఆ వెంటనే పలువురు క్రీడాకారుల నుంచి నిరసనలు వ్యక్తమవడం
వచ్చే ఏడాది నుంచి అమల్లోకి...
న్యూఢిల్లీ: ప్రతీ ఏడాది జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించడం... ఆ వెంటనే పలువురు క్రీడాకారుల నుంచి నిరసనలు వ్యక్తమవడం పరిపాటిగా మారింది. దీంతో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, అర్హులైన వారందరికీ అన్యాయం జరగకుండా చూసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో అవార్డుల కోసం ఆటగాళ్ల ఎంపిక పద్ధతిని మార్చాలని ఆలోచిస్తోంది. ఆయా క్రీడా సమాఖ్యల ద్వారా నామినేట్ అయిన వారికే ఇప్పటిదాకా అవార్డులను ప్రకటిస్తున్నారు. కానీ అర్హులై ఉండి అలా నామినేట్ కాని వారిని కూడా ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఈపాటికే కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ ఈ దిశగా చర్చలు ప్రారంభించారని సమాచారం. ‘వచ్చే ఏడాది నుంచి అవార్డుల పద్ధతిని మార్చాలనుకుంటున్నాం. త్వరలోనే కొత్త నిబంధనలు వస్తాయి. సమాఖ్యల ద్వారా నామినేట్ కానివారు... తాము సొంతంగా దరఖాస్తు పెట్టుకోని వారిలో కూడా నిజంగా అర్హులై ఉంటే వారినీ ఎంపిక చేస్తారు. ప్రతీ సెలక్షన్ కమిటీ సభ్యుడు కూడా నామినేట్ కాని అర్హుడైన అథ్లెట్‌పై నిర్ణయం తీసుకోవచ్చు. సభ్యుడి సలహా మేరకు ప్యానెల్ ఆ ఆటగాడి ప్రదర్శనపై ఓ అంచనాకు వస్తారు’ అని క్రీడా శాఖ అధికారి ఒకరు తెలిపారు.