ఎవరీ బియాంక..! | Bianca Andreescu sees a remarkable vision come true at US OPEN | Sakshi
Sakshi News home page

ఎవరీ బియాంక..!

Sep 9 2019 5:16 AM | Updated on Sep 9 2019 5:16 AM

Bianca Andreescu sees a remarkable vision come true at US OPEN - Sakshi

ఏడాది క్రితం వరకు టాప్‌–150లో కూడా లేని బియాంక నేడు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరించింది. యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ కావాలని మూడేళ్ల క్రితమే బియాంక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2016లో ప్రతిష్టాత్మక జూనియర్‌ టోర్నీ ఆరెంజ్‌ బౌల్‌ టైటిల్‌ సాధించిన బియాంక... యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌కు ఇచ్చే చెక్‌ ప్రతిని తయారు చేసుకొని దానిపై తన పేరును రాసుకుంది. మూడేళ్ల తర్వాత బియాంక ఏకంగా నిజమైన చెక్‌నే అందుకోవడం విశేషం. బియాంక తల్లిదండ్రులు మారియా, నికూ 1994లో రొమేనియా నుంచి కెనడాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. 2000 జూన్‌ 16న టొరంటోలో బియాంక జన్మించింది.

ఏడేళ్ల ప్రాయంలో రాకెట్‌ పట్టుకున్న బియాంక నాలుగేళ్ల తర్వాత కెనడా జాతీయ టెన్నిస్‌ ప్రోగ్రామ్‌లో భాగమైంది. కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టింది. 2016లో రోజర్స్‌ కప్‌ టోర్నీ సందర్భంగా సిమోనా హలెప్‌ సూచనతో ప్రొఫెషనల్‌గా మారింది. తల్లి మారియా పర్యవేక్షణలో 12 ఏళ్ల ప్రాయం నుంచే ధ్యానం చేసే అలవాటు చేసుకున్న బియాంక 2017లో వింబుల్డన్‌ టోర్నీ మెయిన్‌ ‘డ్రా’లో అడుగుపెట్టి తొలి రౌండ్‌లో నిష్క్రమించింది. 2018లో నిలకడగా ఆడిన ఆమె ఈ ఏడాది మరింత రాటుదేలింది. ప్రీమియర్‌ ఈవెంట్‌ టోర్నీలైన ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్, రోజర్స్‌ కప్‌ టోర్నీల్లో టైటిల్స్‌ గెలిచి యూఎస్‌ ఓపెన్‌లో అడుగు పెట్టింది. తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకంగా గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా నిలిచింది. గాయాల బారిన పడకుండా... తన ఆటను మరింత మెరుగుపర్చుకుంటే 2020లో బియాంక ఖాతాలో మరిన్ని టైటిల్స్‌ చేరే అవకాశముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement