సీఓఏ పరోక్షంగా సహకరించింది! 

BCCI new constitution: CoA rejects Bihar compliance report - Sakshi

బీసీసీఐని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడంపై  ఆఫీస్‌ బేరర్ల ఆగ్రహం

కోర్టులో సవాల్‌ చేసేందుకు సిద్ధం 

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడంపై ఊహించినట్లుగానే బోర్డులో ఒక్కసారిగా ప్రకంపనలు రేగుతున్నాయి. బీసీసీఐని ఇప్పటి వరకు స్వతంత్ర వ్యవస్థగా నడిపిస్తూ వచ్చిన ఆఫీస్‌ బేరర్లు కొత్త పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే దీనిపై కోర్టుకెక్కాలని కూడా యోచిస్తున్నారు. అసలు దీనికి కారణం క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) వ్యవహార శైలే అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వారి కారణంగానే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్టీఐ విషయంలో చట్టపరంగా బీసీసీఐ ముందుకు వెళ్లే హక్కును సీఓఏ కాలరాసింది. ఇది వారంతా కావాలని చేసిందే అని మా గట్టి నమ్మకం. బీసీసీఐని ఎందుకు ఆర్టీఐ పరిధిలోకి తీసుకు రావద్దో చెప్పాలంటూ వాదనలు వినిపించేందుకు జూలై 10న సమాచార శాఖ కమిషన్‌ అవకాశం కల్పించింది.

అయితే ఆ షోకాజ్‌ నోటీస్‌కు బోర్డు నుంచి కనీస స్పందన లేదు. బోర్డు ఎన్నికలకు ముందు ఆర్టీఐని మా మెడకు చుట్టాలని సీఓఏ భావించింది. ఇప్పుడు దీనిని హైకోర్టులో చాలెంజ్‌ చేయడం తప్ప మాకు మరో అవకాశం లేదు. దురదృష్టవశాత్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను సీఓఏ తప్పుగా వాడుకుంది’ అని ఆ అధికారి అన్నారు. బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రావడం వల్ల ఎలాంటి ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతాయనే విషయంపై కూడా బోర్డు అధికారి తన అభిప్రాయం వెల్లడించారు. జట్టు ఎంపిక, ఐపీఎల్‌ యాజమాన్యం పాత్ర, పెట్టుబడులు, అధికారుల ప్రవర్తన, ఒక యువ ఆటగాడికి వరుసగా అవకాశాలు ఇస్తుంటే అతనికి మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, బ్రాండ్లతో ఉన్న సంబంధాలు ఎలాంటివి అనే అంశాలన్నంటిపైనా ప్రశ్నల వర్షం కురుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top