ఓవర్‌లో ఏడో బంతికి బ్యాట్స్‌మన్‌ ఔట్‌!

Batsman gets out on 7th ball of an over after bizarre umpiring error - Sakshi

పెర్త్‌: బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో ఓ బ్యాట్స్‌మన్‌ ఔటైన తీరు వివాదాస్పదమైంది. సాధారణంగా ఓవర్‌కు ఆరు స్ట్రైయిట్ బంతులు మాత్రమే పడాల్సిన ఉన్నా అంపైర్‌ ఏడో బాల్‌ వేయించడంతో  పాటు ఆ బంతికి బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కావడం వివాదానికి దారి తీసింది.  ఆస్ట్రేలియా వేదిక జరుగుతున్న బీబీఎల్‌లో భాగంగా ఆదివారం పెర్త్‌ స్కార్చర్స్‌-సిడ్నీ సిక్సర్‌ జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టు 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఓవర్‌లో ఓపెనర్‌ మైకేల్‌ క్లింగర్‌ ఏడో బంతికి ఔటయ్యాడు. ఓవర్‌కు వేసే బంతుల్ని లెక్కించే క్రమంలో అంపైర్‌ ఒక్క బంతి ఎక్కువగా వేయించాడు. ఆ బంతికి క్లింగర్‌ ఔట్‌ కావడం చర్చకు దారి తీసింది.

డ్వార్‌షూయిస్‌ వేసిన సదరు ఓవర్‌ తొలి రెండు బంతుల్ని మరో ఓపెనర్‌ బెన్‌క్రాఫ్ట్ ఆడి ఒక లెగ్‌ బై ద్వారా పరుగు తీశాడు. ఆపై మూడో బంతిని క్లింగర్‌ ఆడి బై ద్వారా రెండు పరుగులు సాధించగా, నాల్గో బంతికి క్లింగర్‌ పరుగు తీశాడు. ఇక ఐదో బంతికి బెన్‌ క్రాఫ్‌ ఆడి రెండు పరుగులు తీయగా, ఆరు బంతికి పరుగు తీశాడు. దాంతో ఓవర్‌ పూర్తయ్యింది. అయితే మరొక బంతిని అంపైర్‌ వేయించడంతో క్లింగర్‌ ఔటయ్యాడు. ఫీల్డ్‌ అంపైర్‌ చేసిన తప్పిదాన్ని మ్యాచ్‌ అధికారులు సైతం గుర్తించకపోవడంతో క్లింగర్‌ 2 పరుగులకే పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో అజేయంగా 87 పరుగులు సాధించడంతో పెర్త్‌ స్కార్చర్స్‌ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపును అందుకుంది. బాల్‌ ట్యాంపరింగ్‌తో నిషేధానికి గురై ఇటీవల ప్రొఫెషనల్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బెన్‌క్రాఫ్ట్‌ బ్యాట్‌తో మెరవడం పెర్త్‌ స్కార్చర్స్‌ అభిమానుల్ని అలరించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top