బజరంగ్‌ను ఓడించారు

Bajrang Punia, Ravi Kumar lose semi-final - Sakshi

వివాదాస్పద రీతిలో సెమీస్‌లో ఓటమి

అయినా ఒలింపిక్స్‌కు అర్హత

రవి దహియాకు కూడా టోక్యో చాన్స్‌

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌): భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన బజరంగ్‌ ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కానీ... సెమీఫైనల్లో ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్‌ రెజ్లర్‌ నియజ్బెకొవ్‌ కావడమే పూనియాకు ప్రతి   కూలంగా మారింది. నిర్వాహకుల పక్షపాతం భారత రెజ్లర్‌ సువర్ణావకాశాన్ని దెబ్బతీసింది. 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరు 9–9 పాయింట్లతో సమంగా నిలవగా...ఒకే సారి నాలుగు పాయింట్లు సాధించిన ‘బిగ్గర్‌ త్రో’ ఆధారంగా నియజ్బెకొవ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు.

ఈ బౌట్‌లో ఓటమితో బజరంగ్‌ ఇప్పుడు  కాంస్యం కోసం తలపడనున్నాడు. మరో రెజ్లర్‌ రవి దహియా టోక్యో బెర్తు ఖాయం చేసుకున్నాడు. కానీ సెమీస్‌లో అతను కూడా పరాజయం చవిచూడటంతో భారత్‌కు రజతం, బంగారం దూరమయ్యాయి. కాంస్యం కోసం బజరంగ్‌... డేవిడ్‌ హబట్‌ (స్లోవేనియా)తో తలపడతాడు.  మహిళల ఈవెంట్‌లో సాక్షి మలిక్‌ తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. కాంస్యం బరిలో నిలిచిన పూజ ధండా కూడా ఓడిపోయింది.

పట్టించుకోని రిఫరీలు...
గత బుడాపెస్ట్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న బజరంగ్‌ ఈసారి స్వర్ణంపై కన్నేశాడు. అందుకు తగ్గట్లే కఠోరంగా శ్రమించాడు. ఎదురు లేకుండా 65 కేజీల విభాగంలో సెమీస్‌ చేరాడు. గురువారం డౌలెత్‌ నియజ్బెకొవ్‌తో జరిగిన సెమీఫైనల్‌ బౌట్‌లో ఆరంభం నుంచి ఆతిథ్య దేశం ఎన్ని కుయుక్తులు చేసినా... పట్టువదలని ఈ కుస్తీవీరుడు పాయింట్లు గెలుస్తూనే వచ్చాడు. 6 నిమిషాల ఈ బౌట్‌ చివరకు 9–9 స్కోరు వద్ద ముగిసింది.  అయితే నిర్వాహకులు, రిఫరీలు... ఈ పోటీలో తమ కజకిస్తాన్‌ రెజ్లర్‌ త్రో, పూనియా కంటే మెరుగని ఏకపక్షంగా తేల్చేశారు. పైగా బౌట్‌ మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా నియజ్బెకొవ్‌ కోలుకునేందుకు చాలా సమయం ఇచ్చారు. కనీసం మూడు సార్లు ఇలా జరగ్గా ఒక్కసారి హెచ్చరిక కూడా జారీ చేయలేదు.

బజరంగ్‌ అక్కడే తన అసహనాన్ని ప్రదర్శించినా రిఫరీలు పట్టించుకోలేదు. దీనిపై పూనియా కోచ్‌ షాకో బెనిటిడిస్‌ తీవ్రంగా మండిపడ్డారు. బజరంగ్‌ మెరుగైన త్రోలను పట్టించుకోలేదని... బౌట్‌ను పరిశీలిస్తే తమ రెజ్లర్‌కే అదనంగా రెండు పాయింట్లు వస్తాయని, గెలిచేందుకు అది సరిపోయేదని కోచ్‌ వివరించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో కొరియా రెజ్లర్‌ జొంగ్‌ చొయ్‌ సన్‌తో తలపడిన బజరంగ్‌ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. 57 కేజీల విభాగంలో రవి దహియా తొలి రెండు బౌట్లను టెక్నికల్‌ సుపీరియారిటీ ద్వారా గెలిచాడు. అనంతరం జరిగిన క్వార్టర్స్‌లో అతను 6–1తో యుకి టకహషి (జపాన్‌)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ జువర్‌ వుగుయెవ్‌ (రష్యా) 6–4తో రవి జోరుకు బ్రేకులేశాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం రవికి ఊరట.

సాక్షి మలిక్‌ అవుట్‌...
మహిళల 59 కేజీల కాంస్య పతక పోరులో పూజ 3–5తో జిన్‌ గ్రూ పీ (చైనా) చేతిలో ఓడింది. 62 కేజీల కేటగిరీలో సాక్షి మలిక్‌ తొలిరౌండ్లోనే నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి 7–10తో నైజీరియాకు చెందిన అమినట్‌ అడెనియి చేతిలో కంగుతింది. 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్‌ 0–2తో ఒలింపిక్‌ చాంపియన్‌ సార దొషొ (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూసింది. సాక్షి, దివ్యలను ఓడించిన ప్రత్యర్థులు క్వార్టర్స్‌లో ఓడటంతో రెపిచేజ్‌ అవకాశం లేకుండా పోయింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top