ఇది కదా వార్నర్‌ అంటే..

AUS VS NZ Test Series: Warner Made Young Fan's Day With His Grand Gesture - Sakshi

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన ఆటతోనే కాకుండా అంతకుమించిన గొప్ప మనసుతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. బేసిక్‌గా వార్నర్‌కు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. దీంతో మైదానం వెలుపల, బయట తనకు తారసపడే బుల్లి అభిమానులకు ఎదో సర్‌ప్రైజ్‌ ఇస్తుంటాడు. కొన్ని సార్లు ఎవరి ఊహకందని గిప్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. గతంలో షర్ట్స్‌, గ్లవ్స్‌, హెల్మెట్‌, ఆటోగ్రాఫ్‌, ఫోటోగ్రాఫ్స్‌ అంటూ తనకు నచ్చిన, తోచినవి ఇస్తూ వారిని సంభ్రమశ్చార్యాలకు గురిచేస్తుంటాడు. తాజాగా న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి టెస్టులో ఆఖరి రోజు ఆట చూడటానికి మైదానానికి వచ్చిన ఓ చిన్నారి అభిమానికి వార్నర్‌ జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. 

మ్యాచ్‌ ఆరంభానికి ముందు వార్నర్‌ మైదానంలో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ప్రాక్టీస్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతున్న సమయంలో తననే తదేకంగా చూస్తున్న ఓ అభిమానికి వార్నర్‌ తన బ్యాట్‌ను బహుకరించాడు. ఇలా ఊహించని పరిణామం ఎదురవడంతో ఆ బాలుడు కాసేపు షాక్‌లోనే ఉండిపోయాడు. అనంతరం ఎగిరిగంతేశాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ‘వార్నర్‌ అంటే ఇది కదా!’, ‘గట్సే కాదు దిల్‌ ఉన్నోడు’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం తర్వాత వార్నర్‌ ఆటలో వ్యక్తిత్వంలో చాలా మార్పులు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నిషేధ సమయంలో ఓ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. అయితే ఈ అవమానకర ఘటనల నుంచి కోలుకోవడానికి తన కుటంబమే కారణమని ముఖ్యంగా తన సతీమణి కష్ట కాలంలో తోడుగా ఉందని వివరించిన సంగతి విదితమే. నిషేధం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన వార్నర్‌ చాలా పరిణితిని ప్రదర్శిస్తున్నాడు. ఇక కివీస్‌తో జరిగిన చివరి టెస్టులో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top