రెండోసారి బోల్ట్ ‘స్ప్రింట్ డబుల్’ | Athletics: Bolt completes sprint double with ease | Sakshi
Sakshi News home page

రెండోసారి బోల్ట్ ‘స్ప్రింట్ డబుల్’

Published Sun, Aug 18 2013 12:46 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

రెండోసారి బోల్ట్ ‘స్ప్రింట్ డబుల్’

రెండోసారి బోల్ట్ ‘స్ప్రింట్ డబుల్’

గట్టి పోటీనిచ్చేవారు లేకపోయినా ఉన్నవారినీ ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ వాయువేగంతో పరిగెత్తాడు.

మాస్కో (రష్యా): గట్టి పోటీనిచ్చేవారు లేకపోయినా ఉన్నవారినీ ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ వాయువేగంతో పరిగెత్తాడు. 200 మీటర్ల రేసులోనూ విజేతగా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన పురుషుల 200 మీటర్ల రేసును బోల్ట్ 19.66 సెకన్లలో పూర్తి చేశాడు. ప్రస్తుత  చాంపియన్‌షిప్‌లో రెండో స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. వారెన్ వీర్ (జమైకా-19.79 సెకన్లు) రజతం... కర్టిస్ మిచెల్ (అమెరికా-20.04 సెకన్లు) కాంస్యం నెగ్గారు. గత సోమవారం జరిగిన 100 మీటర్ల రేసులోనూ బోల్ట్ పసిడి పతకాన్ని నెగ్గిన సంగతి తెలిసిందే.
 
  ఈ క్రమంలో 30 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో  100, 200 మీటర్ల రేసుల్లో రెండుసార్లు స్వర్ణ పతకాలను నెగ్గిన తొలి అథ్లెట్‌గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. 2009 బెర్లిన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్  100, 200 మీటర్ల రేసులతోపాటు 4ఁ100 మీటర్ల రిలేలో బంగారు పతకాలను సాధించాడు. గతంలో మౌరిస్ గ్రీన్ (అమెరికా-1999లో); జస్టిన్ గాట్లిన్ (అమెరికా-2005లో); టైసన్ గే (అమెరికా-2007లో) ఒక్కోసారి ‘స్ప్రింట్ డబుల్’ నమోదు చేశారు. కానీ బోల్ట్ మాదిరిగా రెండుసార్లు ఈ ఘనతను ఎవరూ సాధించలేదు. తాజా ప్రదర్శనతో బోల్ట్‌కు అథ్లెటిక్స్ ప్రపంచంలో దిగ్గజ హోదా ఖాయమైందనుకోవాలి. 200 మీటర్లలో బోల్ట్‌కిది ‘హ్యాట్రిక్’ స్వర్ణం. 2009, 2011 పోటీల్లోనూ అతను విజేతగా నిలిచాడు. 
 
 స్టార్ అథ్లెట్స్ ఎవరూ లేకపోవడంతో 200 మీటర్ల రేసులో బోల్ట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సంయమనంతో రేసుకు సన్నద్ధమైన ఈ ‘జమైకా చిరుత’ వ్యూహాత్మకంగా ఆరంభంలో కాస్త నెమ్మదిగా పరిగెత్తాడు. 100 మీటర్లు పూర్తయ్యాక వేగం పెంచిన ఈ ఒలింపిక్ చాంపియన్ ఆ తర్వాత అందరినీ వెనక్కి నెట్టి దూసుకుపోయాడు. విజయం ఖాయంకావడంతో చివరి 20 మీటర్లలో కాస్త నెమ్మదించాడు. దాంతో ప్రపంచ రికార్డుకు అవకాశం లేకుండా పోయింది. ఆదివారం జరిగే 4ఁ100 మీటర్ల రిలేలోనూ బోల్ట్ బరిలోకి దిగనున్నాడు. 
 
 రోలిన్స్‌కు 100 మీటర్ల  హర్డిల్స్ స్వర్ణం
  మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో డిఫెండింగ్ ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ స్యాలీ పియర్సన్ (ఆస్ట్రేలియా-12.50 సెకన్లు) రజత పతకంతో సరిపెట్టుకుంది. బ్రియానా రోలిన్స్ 12.44 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. పురుషుల మారథాన్ రేసులో స్టీఫెన్ కిప్రోతిచ్ (ఉగాండా-2గం:9ని:51 సెకన్లు) పసిడి పతకం నెగ్గాడు. మహిళల 5000 మీటర్ల రేసులో మెజరెట్ డెఫర్ (ఇథియోపియా-14ని:50.19 సెకన్లు); మహిళల హైజంప్‌లో స్వెత్లానా షోకొలినా (రష్యా-2.03 మీటర్లు); పురుషుల జావెలిన్ త్రోలో వెతెస్లావ్ వెసెలి (చెక్ రిపబ్లిక్-87.17 మీటర్లు) స్వర్ణ పతకాలను సాధించారు. మహిళల 4x400 మీటర్ల రిలే రేసులో రష్యా (3ని:20.19 సెకన్లు) బృందం బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 
 
 చిరుతకు సాటిలేరు
 మరో గొప్ప విజయం... మరోసారి స్పష్టమైన ఆధిపత్యం... సమకాలీన క్రీడాప్రపంచంలో ‘సాటిలేని మేటి’ అని ఉసేన్ బోల్ట్ కితాబు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇక ఈ జమైకా స్టార్‌ను అథ్లెటిక్స్‌లో ‘ఆల్‌టైమ్ గ్రేట్’ అని ప్రకటించేందుకు వెనుకాడాల్సిన అవసరం కూడా లేదు. శనివారం పురుషుల 200 మీటర్ల రేసులో విజేతగా నిలిచిన బోల్ట్ తనకు ఎవరూ సాటిలేరని చెప్పకనే చెప్పాడు. ఇటీవల డ్రగ్స్ వివాదాలతో మసకబారిన ప్రపంచ అథ్లెటిక్స్ ప్రతిష్టను తాజాగా తన తిరుగులేని ప్రదర్శనతో ఇనుమడింపజేశాడు. బోల్ట్ ఖాతాలో ఇప్పటికే ఆరు ఒలింపిక్ స్వర్ణాలు... ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాలు ఉన్నాయి. ఆదివారం మరో పసిడి చేరే అవకాశముంది. 
 
 ఆదివారం జరిగే 4x100 మీటర్ల రిలేలోనూ బోల్ట్ సభ్యుడిగా ఉండనున్న జమైకా బృందమే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలేలో బోల్ట్ పేరిటే ప్రపంచ రికార్డులు ఉన్నాయి. గత నాలుగేళ్లలో బోల్ట్ అంతర్జాతీయస్థాయిలో 39 సార్లు 100 మీటర్ల రేసుల్లో పాల్గొన్నాడు. ఇందులో అతనికి నాలుగుసార్లు మాత్రమే ఓటమి ఎదురైంది. బోల్ట్‌ను ఓడించిన నలుగురు యోహాన్ బ్లేక్ (జమైకా), టైసన్ గే (అమెరికా), అసఫా పావెల్ (జమైకా), జస్టిన్ గాట్లిన్ (అమెరికా) డోపింగ్‌లో పట్టుబడినవారే కావడం గమనార్హం. ఒక్క బోల్ట్‌కు మాత్రమే ఇప్పటికీ ‘క్లీన్ రికార్డు’ ఉంది. తాజా విజయంతో బోల్ట్‌ను అథ్లెటిక్స్ దిగ్గజాలైన జెస్సీ ఓవెన్స్, మైకేల్ జాన్సన్, సెర్గీ బుబ్కా, కార్ల్ లూయిస్ సరసన చేర్చడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు.
 
 ఆధునిక క్రీడా ప్రపంచంలో బోల్ట్‌తో సమానమైన దిగ్గజాలు ఎవరని ప్రశ్నిస్తే... టెన్నిస్‌లో ఫెడరర్, నాదల్, సెరెనా చాలా కాలమే ఆధిపత్యం చలాయించారు. సెక్స్ కుంభకోణాలు బయటపడకముందు గోల్ఫ్‌లో టైగర్ వుడ్స్ రారాజుగా వెలుగొందాడు. స్విమ్మింగ్‌లో మైకేల్ ఫెల్ప్స్ అసాధారణ ఫలితాలు నమోదు చేశాడు. గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు గెలిచాక తాను అభిమానించే మహ్మద్ అలీ (బాక్సింగ్), పీలే (ఫుట్‌బాల్), మైకేల్ జోర్డాన్ (బాస్కెట్‌బాల్)లకు వచ్చిన పేరు ప్రఖ్యాతులను సంపాదించాడు. ‘అలీ, పీలేలకు ఉన్నంత స్థాయి నాకుందో లేదో చెప్పలేను. 
 
 అయితే ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మాత్రం నేను శిఖరాగ్రాన ఉన్నాను. బాస్కెట్‌బాల్‌లో మైకేల్ జోర్డాన్, బాక్సింగ్‌లో మహ్మద్ అలీ వారికి వారే సాటి. నేనూ వారి విభాగంలో చేరానని అనుకుంటున్నాను. అయితే ఈ విషయాన్ని ప్రజలే నిర్ణయించాలి. నేనైతే దిగ్గజమే అని అనుకుంటున్నాను’ అని ఈ బుధవారం 27 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బోల్ట్ అన్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ బోల్ట్ మూడు టైటిల్స్‌ను నిలబెట్టుకుంటే మాత్రం ఎలాంటి చర్చలు అవసరంలేదు. అతనే శాశ్వత దిగ్గజం అవుతాడు. 
 - సాక్షి క్రీడావిభాగం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement