
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో భారత జట్టులో స్థానాలపై ఇప్పటికే చర్చ మొదలైంది. గత కొంతకాలంగా ఆటగాళ్లను పరీక్షిస్తూ వస్తున్న టీమిండియా యాజమాన్యం దాదాపు ఒక స్పష్టతకు వచ్చినట్లే కనబడుతోంది. అయితే టీమిండియా ప్రధాన ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ పరిస్థితి డైలామాలో ఉంది. ప్రస్తుతం భారత స్పిన‍్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్‌లు విశేషంగా రాణిస్తుండటంతో అశ్విన్‌కు చోటు కష్టంగానే కనబడుతోంది.
కాగా, అశ్విన్‌కు మద్దతుగా నిలిచాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టులో అశ్విన్‌కు కచ్చితంగా స్థానం కల్పించాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అశ్విన్ బౌలింగ్‌కు ఇంగ్లండ్ పిచ్‌లు బాగా నప్పుతాయని అభిప్రాయపడిన గంభీర్.. ప్రపంచకప్‌లో అతనికి అవకాశమివ్వాలని సూచించాడు.
‘ప్రపంచకప్ సమయంలో ప్లాట్ పిచ్‌లు ఎదురైతే..? చేతి వేళ్లతో బంతిని తిప్పే అశ్విన్ బాగా ఉపయోగపడతాడు. అలా అని మణికట్టు స్పిన్నర్లని నేను ఏమీ తక్కువ చేయడం లేదు. గత ఏడాది కాలంగా కుల్దీప్, చహల్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కానీ ప్రపంచకప్ జట్టులో అశ్విన్ కూడా ఉంటే అది టీమ్‌కి అదనపు బలం. వరల్డ్‌కప్ ఆడే భారత జట్టులో అశ్విన్‌ను పరిగణలోకి తీసుకోండి’ అని గంభీర్ తెలిపాడు.