ఆగర్‌ దూసుకొస్తున్నాడు..!

Ashton Agar Shoot Up Six Places To Number Four - Sakshi

దుబాయ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆసీస్‌ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ ఆగర్‌ తన ర్యాంకింగ్స్‌లో కూడా దూసుకొస్తున్నాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఒకేసారి ఆరు స్థానాలు ఎగబాకి నాల్గో స్థానానికి చేరుకున్నాడు. సఫారీలతో తొలి టీ20లో ఐదు వికెట్లు సాధించిన ఆగర్‌.. మూడో టీ20లో మూడు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో ఎనిమిది వికెట్లను ఆగర్‌ సాధించాడు. ఫలితంగా 712 రేటింగ్‌ పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచాడు.  ఆసీస్‌కే చెందిన మరో స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 713 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 749 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో ఉండగా, అఫ్గాన్‌కే చెందిన ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌ 742 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. టాప్‌-10లో భారత బౌలర్లకు ఎవరూ చోటు దక్కించుకోలేదు.(ఇక్కడ చదవండి: ‘జడేజానే నా ఫేవరెట్‌ ప్లేయర్‌’)

ఇక బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 823 రేటింగ్‌ పాయింట్లతో రాహుల్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గత నెలలో రెండో స్థానానికి ఎగబాకిన రాహుల్‌ దానిని పదిలం చేసుకున్నాడు. ఈ జాబితాలో బాబర్‌ అజామ్‌ 879 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక్కడ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 10వ స్థానంలో ఉ‍న్నాడు. ఆరోన్‌ ఫించ్‌ మూడో స్థానంలో, కోలిన్‌ మున్రో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఆల్‌ రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌ ప్లేయర్‌ మహ్మద్‌ నబీ 319 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే ఆటగాడు సీన్‌ విలియమ్స్‌ 212 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలవడగా, మ్యాక్స్‌వెల్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top