భరత్, రికీ భుయ్‌ సెంచరీలు

Andhra Ranji Match Drawn With Vidarbha - Sakshi

విదర్భతో ఆంధ్ర రంజీ మ్యాచ్‌ ‘డ్రా’

మూలపాడు (విజయవాడ): వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (208 బంతుల్లో 102 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్‌ (209 బంతుల్లో 100 నాటౌట్‌; 13 ఫోర్లు, సిక్స్‌) అజేయ శతకాలతో పోరాడారు. ఫలితంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రంజీ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించినందుకు విదర్భకు మూడు పాయింట్లు లభించగా... ఆంధ్ర జట్టు ఖాతాలో ఒక పాయింట్‌ చేరింది. ఓవర్‌నైట్‌ స్కోరు 100/2తో  చివరి రోజు గురువారం ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 103.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసి 84 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఫలితం తేలదనే కారణంతో మరో 23.2 ఓవర్లు మిగిలి ఉండగానే ఇరు జట్ల సారథులు ‘డ్రా’కు అంగీకరించారు.

130 పరుగులు వెనుకబడి... కనీసం ‘డ్రా’తో గట్టెక్కాలంటే రోజు మొత్తం బ్యాటింగ్‌ చేయాల్సిన చోట ఆంధ్ర అద్భుతం చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 19 పరుగులు జోడించిన జ్ఞానేశ్వర్‌ (61) అర్ధ శతకం అనంతరం అవుట్‌ అయ్యాడు. ఈ సమయంలో రికీ భుయ్‌కి జత కలిసిన శ్రీకర్‌ భరత్‌ జట్టును ఆదుకున్నాడు. ఎంతో ఓపికను ప్రదర్శించిన ఈ జోడీ క్రీజులో పాతుకుపోయింది. ఇదే క్రమంలో ఇద్దరూ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 186 పరుగుల జోడించారు. చివరి రోజు 66.4 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసిన విదర్భ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా డబుల్‌ సెంచరీ హీరో గణేశ్‌ సతీశ్‌ నిలిచాడు. ఆంధ్ర జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను ఒంగోలులో ఈ నెల 17 నుంచి ఢిల్లీతో ఆడుతుంది.

హైదరాబాద్‌ ఓటమి
మరోవైపు హైదరాబాద్‌ జట్టు రంజీ సీజన్‌ను ఓటమితో ఆరంభించింది. హైదరాబాద్‌ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్లతో తేడాతో ఓడింది. చివరి రోజు ఆటను 239/6తో మొదలు పెట్టిన ఆతిథ్య జట్టు 90.1 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ప్రత్యరి్థకి 187 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్‌ 36.4 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసి గెలిచింది. ప్రియాంక్‌ పాంచల్‌ (90; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా... భార్గవ్‌ మెరాయ్‌ (69 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌), ధ్రువ్‌ (23 నాటౌట్, , 2 ఫోర్లు) మిగతా పనిని పూర్తి చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top