గట్టెక్కిన జ్వెరెవ్‌ | Alexander Zverev battles to first grand slam quarterfinal | Sakshi
Sakshi News home page

గట్టెక్కిన జ్వెరెవ్‌

Jun 4 2018 4:44 AM | Updated on Jun 4 2018 4:44 AM

Alexander Zverev battles to first grand slam quarterfinal  - Sakshi

అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌

పారిస్‌: మూడో రౌండ్‌లో మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకొని ఊపిరి పీల్చుకున్న జర్మనీ టెన్నిస్‌ యువతార అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనూ పోరాడి గట్టెక్కాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధించాడు. టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 4–6, 7–6 (7/4), 2–6, 6–3, 6–3తో కరెన్‌ ఖచనోవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు. 3 గంటల 29 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ ఏకంగా 17 ఏస్‌లు సంధించాడు.

నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లతోపాటు 51 అవనసర తప్పిదాలు కూడా చేశాడు. ఒకదశలో 1–2 సెట్‌లతో వెనుకబడిన 21 ఏళ్ల జ్వెరెవ్‌ చివరి రెండు సెట్‌లను వరుసగా గెల్చుకొన్ని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ‘నేనింకా యువకుడినే. ఇంకొంత సమయం కోర్టులో గడిపి మీ అందరికీ వినోదం అందిస్తాను’ అని మ్యాచ్‌ అనంతరం జ్వెరెవ్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. ‘నేను, నా సోదరుడు మిషా జ్వెరెవ్‌ రోజుకు నాలుగైదు గంటలు జిమ్‌లో గడుపుతాం. ట్రెడ్‌మిల్‌పై సాధన చేస్తాం. ఆ శ్రమ ఈ రోజు ఫలితాన్నిచ్చింది’ అని జ్వెరెవ్‌ అన్నాడు.

క్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)తో జ్వెరెవ్‌ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో థీమ్‌ 6–2, 6–0, 5–7, 6–4తో 19వ సీడ్‌ నిషికోరి (జపాన్‌)పై గెలిచి వరుసగా ఈ టోర్నీలో మూడోసారి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాజీ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–3, 6–4, 6–2తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్‌)పై గెలుపొందగా... అన్‌సీడెడ్‌ మార్కో సెచినాటో (ఇటలీ) 7–5, 4–6, 6–0, 6–3తో ఎనిమిదో సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)ను బోల్తా కొట్టించి జొకోవిచ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యాడు.

స్లోన్‌ స్టీఫెన్స్‌ జోరు...
మహిళల సింగిల్స్‌ విభాగంలో అమెరికా యువ తారలు పదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్, 13వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో స్లోన్‌ స్టీఫెన్స్‌ 6–2, 6–0తో కొంటావీట్‌ (ఎస్తోనియా)పై... కీస్‌ 6–1, 6–4తో బుజర్‌నెస్కూ (రొమేనియా)పై గెలుపొందారు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 26వ సీడ్‌ బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 4–6, 3–6తో యూలియా పుతింత్‌సెవా (కజకిస్తాన్‌) చేతిలో పరాజయం పాలైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement