
మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో తమ పోరాటం సెమీస్‌లోనే ముగియడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరంభంలోనే కీలక వికెట్లను చేజార్చుకోవడం ఓటమిపై ప్రభావం చూపిందని వ్యాఖ్యానించాడు. ఛేదించే లక్ష్యమే అయినప్పటికీ విఫలం కావడం నిరాశపరిచిందన్నాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లి.. ఓవరాల్‌గా చూస్తే తొలి అర్థ భాగం తమవైపే ఉందని, కాకపోతే సెకాండాఫ్‌లో కివీస్ బౌలర్లు రైట్ లెంగ్త్ బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో తాము ఆదిలోనే ప్రధాన వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడ్డామన్నాడు.(ఇక్కడ చదవండి: టీమిండియా కథ ముగిసె..)
‘నిన్నంతా మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. ఈ రోజు కూడా న్యూజిలాండ్‌ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశాం. ఓవరాల్‌గా చూస్తే కివీస్ నిర్దేశించింది పెద్ద లక్ష్యం కాదు. కానీ చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయాం. సెమీస్‌లోనే వైదొలగడం నిరాశను మిగిల్చింది. ఈ వరల్డ్‌కప్‌లో మా ప్రదర్శన బాగానే ఉంది. నాకౌట్ సమరంలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయాం. న్యూజిలాండ్ బౌలింగ్ యూనిట్ మాపై మొదట్నుంచీ ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యింది.ఈ మ్యాచ్‌లో విజయం క్రెడిట్ అంతా కివీ బౌలర్లదే. మేము టోర్నీ అంతా ఆకట్టుకున్నా కేవలం 45 నిమిషాల పాటు చెత్తగా ఆడటం వల్లే నిష్ర్కమించాం. వరల్డ్‌కప్‌లో మాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్య్’ అన్ని అన్నాడు. ఇక జడేజా సూపర్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘ ఈ రోజు జడేజా ఆడిన తీరు అసాధారణం. ఒత్తిడిలో ఒక మంచి క్రికెట్ ఆడాడు. అతనొక నాణ్యమైన క్రికెటర్ అనడానికి ఈ ఇన్నింగ్స్ ఒక ఉదాహరణ. ఇప్పటికే జడేజా చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా, తాజా ఇన్నింగ్స్ అతని స్కిల్స్‌ను మరింత బయటకు తీసుకొచ్చింది’ అని పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: కొంపముంచిన ధోని రనౌట్!)