
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ బలాబలాలపై ఎన్నో అంచనాలు... ప్రత్యర్థిపై మనదే పైచేయి కానుందనే లెక్కలు... సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ సాధిస్తారనే విశ్లేషణలు... ఇలా భారీ ఆశలతో తొలి టెస్టు బరిలోకి దిగింది భారత్. అనుకున్నట్లే ప్రత్యర్థిని వణికించింది. ఒక దశలో పేస్‌తో పడగొట్టేస్తుందేమో అనిపించింది. కానీ అదికాసేపే... పుంజుకుని ఎదురుదాడికి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మొదటి ఇన్నింగ్స్‌లో తమ జట్టుకు పోరాడే స్కోరును అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ప్రొటీస్ బౌలర్లు పేస్, బౌన్స్, స్వింగ్‌తో ముప్పేట కమ్మేశారు. ఓపెనర్లు సహా అత్యంత కీలకమైన విరాట్ కోహ్లి వికెట్ తీసి పైచేయి సాధించారు.
కేప్‌టౌన్: సొంతగడ్డపై తడబడినా నిలదొక్కుకోగలమని దక్షిణాఫ్రికా మరోసారి నిరూపించింది. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన తొలిటెస్టులో భారత పేసర్ భువనేశ్వర్ (4/87) ధాటికి ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినా... డివిలియర్స్, డుప్లెసిస్‌ల అర్ధ సెంచరీలు, లోయర్ ఆర్డర్‌తో కలిసి వికెట్ కీపర్ డికాక్ జోడించిన భాగస్వామ్యాలతో తేరుకుని తొలి ఇన్నింగ్స్‌లో 73.1 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా... బుమ్రా, షమీ, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్‌ల ‘డి’ త్రయం ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడటంతో పాటు లోయర్ ఆర్డర్ బ్యాట్ ఝళిపించడంతో దక్షిణాఫ్రికా రన్‌రేట్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం 4 పైనే సాగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. 11 ఓవర్లు మాత్రమే ఆడి 3 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాప్రికా నలుగురు ప్రధాన పేసర్లతో రంగంలోకి దిగింది. భారత్ మాత్రం ఆశ్చర్యకరంగా రహానే బదులు రోహిత్‌ను తీసుకుంది. ఇషాంత్, ఉమేశ్‌లను కాదని జస్‌ప్రీత్ బుమ్రాతో అరంగేట్రం చేయించింది.
భువీ దెబ్బకు విలవిల
1–0, 2–7, 3–12... ఇన్నింగ్స్ తొలి అయిదు ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు పరిస్థితిది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టును పేసర్ భువనేశ్వర్ దెబ్బతీశాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగూ చేరకుండానే ఓపెనర్ డీన్ ఎల్గర్ (0)ను అవుట్ చేసిన భువీ... వరుస ఓవర్లలో మరో ఓపెనర్ ఐడెన్ మర్‌క్రమ్ (5), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా (3)లనూ వెనక్కి పంపాడు. అతడి మొదటి స్పెల్ గణాంకాలు 3–1–5–3. ఈ జోరు చూస్తే ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందేమో అనిపించింది. కానీ... ఇక్కడినుంచే కథ మారింది. డాషింగ్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ (84 బంతుల్లో 65; 11 ఫోర్లు)కు జత కలిసిన కెప్టెన్ డుప్లెసిస్ (104 బంతుల్లో 62; 12 ఫోర్లు) ప్రత్యర్థిది పైచేయి కాకుండా చూశాడు. పిచ్ పరిస్థితిని గమనించి ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా డివిలియర్స్... భువీని లక్ష్యంగా చేసుకున్నాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు సహా 17 పరుగులు రాబట్టాడు. షమీతో పాటు బౌలింగ్ మార్పులో భాగంగా వచ్చిన బుమ్రానూ వీరు వదల్లేదు. 17వ ఓవర్లో షమీ బౌలింగ్‌లో డుపెస్లిస్ క్యాచ్‌ను స్లిప్‌లో కోహ్లి వదిలేశాడు. ఇదొక్కటి తప్ప ఈ జోడీ ఎక్కడా అవకాశమివ్వలేదు. దూకుడే మంత్రంగా ఆడిన డివిలియర్స్ 55 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 107/3. ఇందులో ఏకంగా 19 బౌండరీలు ఉండటం విశేషం.
తలోచేయి వేశారు...
రెండో సెషన్‌లో డుప్లెసిస్ జోరు చూపాడు. లంచ్‌కు ముందు 37 పరుగులతో ఉన్న అతడు తర్వాత ఎదుర్కొన్న తొలి ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు. ఇదే సమయంలో దూకుడు తగ్గించిన డివిలియర్స్‌ను బుమ్రా అవుట్ చేశాడు. బ్యాట్ లోపలి అంచుకు తగిలిన బంతి వికెట్లను పడగొట్టింది. బుమ్రాకిదే తొలి అంతర్జాతీయ టెస్ట్ వికెట్. అనంతరం డి కాక్ కెప్టెన్‌కు జత కలిశాడు. మరోవైపు అర్ధ శతకం అనంతరం డుప్లెసిస్... పాండ్యా బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మరుసటి బంతికి ఎల్బీ అప్పీల్‌కు వెళ్లిన టీమిండియాకు సానుకూల ఫలితం రాలేదు. అయితే... రెండు బంతుల వ్యవధిలోనే సాహా క్యాచ్ అందుకోవడంతో అతడి ఆట ముగిసింది. 36 ఓవర్లు పూరై్తన ఈ సమయానికి 142/5తో ఉన్న దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగదనిపించింది. కానీ... ఫిలాండర్ తోడుగా డికాక్ స్వేచ్ఛగా ఆడాడు. ఈ ఇద్దరూ 29 బంతుల వ్యవధిలో పది ఫోర్లు కొట్టారు. అశ్విన్‌కు సైతం బౌండరీతో స్వాగతం పలికినా.. అతడి రాకతో పరుగుల వేగం తగ్గింది. జట్టు స్కోరు 200 దాటాక డి కాక్ (40 బంతుల్లో 43; 7 ఫోర్లు)ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో 60 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వ్యక్తిగత స్కోరు 0 వద్దే ధావన్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన కేశవ్ మహరాజ్ కొరకరాని కొయ్యగా మారాడు. అశ్విన్ బౌలింగ్‌లో తొలి సిక్స్ కొట్టాడు. టీ విరామానికి కొద్దిసేపటి ముందు ఫిలాండర్ (35 బంతుల్లో 23; 4 ఫోర్లు)ను షమీ బౌల్డ్ చేశాడు. రబడ (66 బంతుల్లో 26; ఒక సిక్స్)తో కలిసి టీమ్ స్కోరును 250 దాటించిన మహరాజ్ (47 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) అనవసర పరుగుకు ప్రయ త్నించి రనౌటయ్యాడు. రబడ, మోర్కెల్‌లను అశ్విన్ అవుట్ చేసి సఫారీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
భారత్ కూడా అలాగే...
అచ్చం దక్షిణాఫ్రికా తీరులోనే భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయిదో ఓవర్లో ఫిలాండర్ బౌలింగ్‌లో మురళీ విజయ్ (1) గల్లీలో ఎల్గర్‌కు చిక్కాడు. స్టెయిన్ బౌలింగ్‌లో పుల్ షాట్‌కు యత్నించిన ధావన్ (16) అతడికే క్యాచ్ ఇచ్చాడు. భారత్‌కు అన్నిటికంటే పెద్ద దెబ్బ కెప్టెన్ కోహ్లి (5) నిష్క్రమణ. అదనపు బౌన్స్‌తో ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న మోర్కెల్ తొలి బంతిని వెంటాడిన విరాట్ మూల్యం చెల్లించుకున్నాడు. 27 పరుగులకే టాపార్డర్‌ను కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట ముగిసే సమయానికి పుజారా (5), రోహిత్ శర్మ (0) క్రీజ్‌లో ఉన్నారు. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 258 పరుగుల దూరంలో నిలిచింది. రెండో రోజు వీరిద్దరితో పాటు సాహా, పాండ్యా, అశ్విన్ ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే మన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.