
తమిళసినిమా: నటులు రజనీకాంత్, కమలహాసన్‌లకు తమిళనాడు చరిత్ర తెలియదని సీనియర్ దర్శకుడు భారతీరాజా వ్యాఖ్యానించారు. ఆయన «మధురైలో సోమవారం జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికపై భారతీరాజా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ, నటులు రజనీకాంత్, కమలహాసన్‌లపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో, ఐసీయూలో ఉందన్నారు. రాష్ట్రంలో ఐక్యత కరువవ్వడంతో విభజన దారులు చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తమిళులందరూ భేషజాలు విడిచి సంఘటితంగా నిలిస్తే తమిళనాడును ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.
రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్న ఏడుగురిని విడుదల చేయాలని శాసనసభతో అప్పటి ముఖ్యమంత్రి తీర్మానం చేశారని, ఆమె బాటలో పయనిస్తున్నామని చెప్పుకుంటున్న ఈపీఎస్, ఓపీఎస్‌లు వారిని విడుదల చేస్తేనే తాను వారితో కలిసి పనిచేయడానికి సిద్ధం అన్నారు. ఈపీఎస్, ఓపీఎస్‌లు ఫ్యూజు లేని బల్పులని, వారు బీజీపీ బల్బు వెలుతురు కింద నిలబడటంతో వెలుగుతున్నట్లు కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. రజనీ, కమల్ తమిళనాట నేతలను బలపరచే విధంగా ఉండాలిగానీ, వారే అధినేతలు కావాలని ఆశ పడకూడదన్నారు. వారు తమిళులకు ఏం చేశారని నమ్మాలని ప్రశ్నించారు. వీరిద్దరికీ తమిళనాడు చరిత్ర తెలియదని విమర్శించారు. కటౌట్లకు పాలాభిషేకాలు చేసి చెడగొట్టిన రాష్ట్రాన్ని ఇకపై తమిళులందరం ఐక్యంగా కాపాడుకుందాం అని దర్శకుడు భారతీరాజా ప్రజలకు హితవు పలికారు.